11-03-2025 12:44:40 AM
ఆధునిక దేవాలయాల్లో మేటి నాపాక కాకతీయులు,చోళులు నిర్మించిన అపురూప కట్టడం
ఒకే శిలపై నాలుగు దిక్కుల దేవతా మూర్తులు చుట్టుపక్కల ఆహ్లాదకరమైన వాతావరణం, కోనేరు
చిట్యాల,మార్చి 10:జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైన్పాక గ్రామ శివారు ప్రాంతంలో కాకతీయులు,చోళులు నిర్మించిన అపురూప కట్టడం శ్రీ నాపాక సర్వతోభద్ర దేవస్థానం.ఈ ఆలయంలో చెక్కబడిన విగ్రహాలకు అద్భుతమైన ప్రత్యేకత సంతరించుకుంది.ఆలయం లోపలికి వెళ్లడానికి నలుదిక్కుల నుంచి నాలుగు ముఖ ద్వారాలు ఉండడం ప్రత్యేకం.
గతంలో ఆలయం పక్కన కొనేరులో మునులు స్నానం చేసి దేవతమూర్తులకు పూజలు నిర్వహించేవారని,మునులకు నిలయంగా ఆలయాన్ని నిర్మించుకున్నారని అందుకే మునికుంటగా పిలిచేవారని స్థానికులు చెబుతున్నారు. ఈ సుందరమైన ఆలయానికి పురాతన శిల్పకళా వైభవంతో పాటు, మహిమానిత్వ వైభవాన్ని తీసుకురావడానికి స్థానికులు,ప్రజాప్రతినిధులు,రాజకీయ నాయకులు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు.
గత 7 సంవత్సరాల క్రితం ఆలయ విశిష్ఠతను గుర్తించిన గ్రామస్థులు దాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆలయా నికి కమిటీ ఏర్పాటు చేసుకుని విరాళాలు సేకరించారు. చేయీ చేయీ కలిపి ఆలయాన్ని శుభ్రం చేసి అర్చకులను నియమించారు.ప్రతి సంవత్సరం నుంచి జనవరి నెలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైభవంగా జాతరను జరిపారు.
అదే మాదిరిగా ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారి బ్రహ్మోత్సవాలను మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. దీంతో గుడి గురించి అందరికీ తెలిసింది. అయితే ఆలయానికి పూర్వవైభవన్ని తీసుకరావడానికి స్థానికులు అప్పటి భూపాలపల్లి ఎమ్మెల్యే,మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి దృష్టికి తీసుకువెళ్లారు.సానుకూలంగా స్పందించిన ఆయన ఆలయ అభివృద్ధికి రూ.2 కోట్లు మంజూరు చేయించారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర పురావస్తు శాఖ సర్వే చేపట్టి ఆలయాన్ని అపురూపంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
నాపాక ఆలయంలోని ప్రత్యేకతలు
-ఆలయానికి నాలుగు ముఖద్వారాలుంటాయి.ఒకే రాతిపై నాలుగు వైపులా దేవతా విగ్రహాలను చెక్కారు.తూర్పు ముఖద్వారం వైపు శ్రీ లక్ష్మీనరసింహస్వామి.దక్షిణ ముఖ ద్వారం వైపు శ్రీ కాలింగమర్దన వేణుగోపాలస్వామి.పశ్చిమ ముఖద్వారం వైపు శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి.ఉత్తర ముఖద్వారం వైపు సీతారామ లక్ష్మణ,ఆంజనేయ స్వామి,గరుడాళ్వార్ విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి.
గుడిని పూర్తిగా రాతితో నిర్మించారు.గుడి పైభాగంలో గాలి గోపురం సుమారు 50 అడుగుల ఎత్తు ఉంటుంది.గుడి పక్కన కోనేరు,గుడి వెనకాల చెరువు,చుట్టుపక్కల ఆహ్లాదకరమైన వాతావరణం,పంట పొలాలు,స్వామివారి పాదుకలు,లజ్జగౌరి,11 పాదులు,ఇతర నిర్మాణాలు ఉన్నాయి.
గ్రామస్థులు మమేకంతో ఉత్సవాలు
--ఆలయ నిర్వాహకులు ప్రతి ఏటా గ్రామస్తుల నుంచి చందాలను సేకరించి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.చైత్ర శుద్ధ శ్రీరామనవమి పర్వదినమున శ్రీ సీతారాముల కళ్యాణం,వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జయంతి,శ్రావణ బహుళ అష్టమి రోజున శ్రీ కృష్ణ జన్మాష్టమి,ముక్కోటి ఏకాదశిన శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణం జాతర బ్రహ్మోత్సవాలు మూడు రోజులు వైభవంగా జరుగుతాయి.
అభివృద్ధికి నోచుకోని నాపాక దేవాలయం
పాలకులు మారుతున్నారే తప్పా ఆలయాన్ని అభివృద్ధి చేసింది లేదని గ్రామస్తులు చెబుతున్నారు. దేవాలయాన్ని పునరుద్ధరించి నిత్యం పూజలు నిర్వహిస్తే మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు. ప్రతి ఏటా చందాలతో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని ఆలయాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.