calender_icon.png 6 January, 2025 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్పత్తి సంఘాలతో అద్భుత ఫలితాలు

04-01-2025 01:48:24 AM

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): కొత్తగా ఏర్పడిన రైతు ఉత్పత్తి సంఘాలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం భారతీయ నూనె గింజన పరిశోధన సంస్థలో నిర్వహించిన రైతు ఉత్పత్తి సంఘాల ఫెడరేషన్ వర్క్‌షాప్‌లో పాల్గొని ప్రసంగించారు.

సహకార సంఘాలు 1904లోనే ఆవిర్భవించినా, ఇప్పటివరకు ఆశించిన మేర వాటి నుంచి ఫలితాలు రాలేదని, ఈ మధ్యకాలంలో కొన్ని మార్పులతో తీసుకొచ్చిన రైతు ఉత్పత్తి సంఘాలకు సహకార వ్యవస్థనే పునాది అని కితాబిచ్చారు. రాష్ట్రంలో ఎఫ్‌పీవోలందరికీ తమ ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు.

ఎఫ్‌పీవోలు ఆర్థికంగా బలోపేతమై సన్న, చిన్నకారు రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లను, యంత్రాలను చౌకధరకు అద్దెకు అందించేలా చూడాలన్నారు. పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు వాటి మార్కెటింగ్, ప్రాసెసింగ్‌లో ఎఫ్‌పీవోలు ప్రధానపాత్ర పోషించాలని సూచించారు.

ఇప్పటికే వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఉన్న మౌలిక సదుపాయాలను వినియోగిస్తూ, బలోపేతం చేసే దిశలో ఎన్‌సీడిసీతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని అధికారులకు సూచించారు.

కార్యక్రమంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, వైస్ చాన్స్‌లర్ ఏ జానయ్య, వ్యవసాయశాఖ సంచాలకులు బీ గోపి,  డైరెక్టర్లు డాక్టర్ ఆర్‌కే మథూర్, డాక్టర్ షేక్ ఎన్ మీరా, డైరెక్టర్, షార్దుల్ జాదవ్, రీజనల్ డైరెక్టర్ జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.