calender_icon.png 24 October, 2024 | 4:49 PM

జై బోలో అమర్‌నాథ్

12-07-2024 01:00:00 AM

గత కొద్ది రోజులుగా ‘భం భం బోలే..’ నినాదాలు మంచుకొండల్లో మారుమోగుతున్నాయి. అటు పహెల్‌గామ్, ఇటు బాల్తాల్ మార్గాలలో పర్వతాలను అధిరోహిస్తూ, లోయల దారుల్లోకి దిగుతూ, పారే నదీ పాయలను, హిమగిరులను సందర్శిస్తూ కిలోమీటర్ల పొడుగున యాత్రికులు బారులు తీరిన దృశ్యాలు భక్తిని, భావోద్వేగాన్ని గొప్పగా చాటుతున్నాయి. ఒకవైపు ఉగ్రదాడుల ఉద్రిక్తతలు, మరోవైపు భద్రతా సిబ్బంది రక్షణ చర్యల నడుమ వారంతా భయాందోళనలను ఉట్టికెక్కించి, చెక్కుచెదరని పూజ్యభావంతో సాగుతుండటం ఆశ్చర్యమే.

జమ్మూ నగరం నుంచి బాల్తాల్, పహెల్‌గామ్ పట్టణాలకు గురువారం తెల్లవారు జామున 3 గంటలకే 14వ బ్యాచ్‌కు చెందిన 4,885 మంది యాత్రికులు మొత్తం 191 వాహనాలలో ‘సిఆర్‌పీఎఫ్’ దళాల రక్షణ ఏర్పాట్ల నడుమ అమర్‌నాథ్ హిమలింగ దర్శనానికి బయల్దేరారు. వీరిలో 2,366 మంది పురుషులు, 1,086 మంది మహిళలు, 32 మంది చిన్నారులు, 163 మంది సాధువులు వున్నారు. బస్సులు, ఇతర వాహనాలు బయల్దేరిన ప్రాంతం, భగవతినగర్ నుంచి బాల్తాల్, పహెల్‌గామ్‌ల వరకు ప్రధాన రహదారి పొడుగునా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరిగాయి. అమర్‌నాథ్ గుహ ప్రదేశం పహెల్‌గామ్ (సంప్రదాయిక ప్రదేశం) నుంచి 48 కి.మీ., బాల్తాల్ (దగ్గరి దారి) నుంచి 14 కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ బ్యాచ్‌లో పహెల్‌గామ్ నుంచి 2,991 మంది, బాల్తాల్‌నుంచి 1,894 మంది మంచుకొండల మార్గాలలో కాలినడకన ప్రయాణించడానికి బయల్దేరి వెళ్లారు. వీరితో కలుపుకొని ఇప్పటి వరకు జమ్మూ బేస్ క్యాంప్ నుంచి మొత్తం 77,210 మంది యాత్రికులు అమర్‌నాథ్ సందర్శనార్థం వెళ్లినట్టుగా అధికారులు చెబుతున్నారు.

జమ్మూ క్యాంప్‌లో జూన్ 29న లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి మొట్టమొదటి బ్యాచ్ యాత్రికులను అనుమతించగా, 52 రోజులపాటు సాగే ఈ సాహసోపేత యాత్ర ఆగస్టు 19న ముగియనున్నది. కాగా, కిందటేడాది మొత్తం నాలుగున్నర లక్షలకు మించి యాత్రికులు పవిత్రమైన, సహజసిద్ధమైన, అరుదైన అమర్‌నాథ్ మంచులింగాన్ని దర్శించుకున్నట్టు వారు చెప్పారు.