calender_icon.png 23 October, 2024 | 8:04 PM

అమరావతి ఆగమాగం

02-09-2024 03:01:57 AM

భారీ వర్షాలతో నీటమునక

ఏపీ సీఎం ఇంటినీ వీడని వరద

తాగునీటికి అవస్థలు

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయ క్రాంతి): రెండు రోజులుగా ఎడతెరపి లేకుం డా కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు జలమయయ్యాయి. విజయ వాడలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. రాజధాని అమరావతిలోనూ ఇబ్బందులు తలెత్తాయి. కృష్ణమ్మ ఉధృతితో ప్రాంతాలు నీట మునిగాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిని సైతం వరద ముప్పు వీడలేదు. ఆయన నివాసం ముందు రెండు అడుగుల మేర నీరు నిలువడంతో సిబ్బంది మోటార్ల సహాయంతో తోడేశారు.

సీఎం నివాసం వైపు పోలీసులు ఎవరినీ అను మతించలేదు. పలు ప్రభుత్వ కార్యాలయాల ముందు కూడా వరద నీరు చేరింది. వరద ఉధృతితో సిటీలో తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. నీటిని సరఫరా చేసే ఉండవల్లి పంపింగ్ కేంద్రంతో పాటు తక్కెళ్లపాడు పిల్లరేషన్ పాయింట్ వరకు పలుచోట్ల మోటర్లు నీటమునిగాయి. కొన్ని పనిచేయలేదు. మరికొన్ని చోట్ల ట్యాంకుల్లో వరద నీరు చేరడంతో తాగునీటిని సరఫరా చేయలేదు. విద్యుత్ అంతరాయం ఏర్పడి నీటి సరఫరాకు అంతరాయం కలిగినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ప్రకాశం బ్యారేజ్‌కు అనూహ్యంగా గంటగంటకు వరద నీటి ప్రవాహం పెరుగుతోంది.