calender_icon.png 1 November, 2024 | 6:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యేదెన్నడు?

16-05-2024 01:21:09 AM

ట్రయల్స్‌పై రెజ్లర్

అమన్ షెరావత్ అసహనం

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు రెజ్లింగ్ క్రీడలో పురుషుల విభాగంలో భారత్ నుంచి అమన్ షెరావత్ ఒక్కడే అర్హత సాధించిన సంగతి తెలిసిందే. 20 ఏళ్ల అమన్ ఇటీవలే ఇస్తాన్‌బుల్ వేదికగా జరిగిన వరల్డ్ క్వాలిఫయర్స్ 57 కేజీల పురుషుల ఫ్రీస్టుల్ విభాగంలో సెమీస్ చేరి పారిస్ బెర్త్ దక్కించుకున్నాడు. మిగతా 11 కేటగిరీల్లో ఒక్కరు కూడా విశ్వక్రీడలకు అర్హత సాధించలేకపోయారు. అయితే పారిస్ బెర్త్ దక్కించుకున్నప్పటికీ అమన్ మరోసారి ట్రయల్స్‌లో పాల్గొనాల్సి వస్తోంది. సోనెపట్ వేదికగా చివరి ట్రయల్స్‌లో రవి దహియా సహా మరో ముగ్గురు రెజ్లర్లు పోటీ పడనున్నారు. వీరిలో విజేతగా నిలిచిన వాళ్లు ఒలింపిక్ కోటా కోసం అమన్‌తో తలపడాల్సి ఉంటుంది. దీనిపై అమన్ అసహనం వ్యక్తం చేశాడు. ‘ఒలింపిక్స్ కోటా సాధించినప్పటికి దానిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నా. ఇప్పటికే చాలాసార్లు నా వెయిట్ కేటగిరీని తగ్గించుకుంటూ వచ్చాను. 57 కేజీల విభాగంలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తర్వాత మరోసారి ట్రయల్స్ ఆడాల్సి వస్తోంది. దీంతో అటు ఒలింపిక్స్‌కు సన్నద్ధమవ్వాలా లేక ట్రయల్స్‌లో పాల్గొనాలా అన్న సందిగ్ధంలో పడిపోయా. ఇలా ట్రయల్స్‌లో పాల్గొంటూ పోతే ఒలింపిక్స్‌కు సమయం దగ్గరపడేలా ఉంది. ఇక నా ప్రిపరేషన్‌ను ప్రారంభించేది ఎప్పుడు?. ఈ ట్రయ ల్స్ లేకుంటే రష్యాకు వెళ్లిపోయేవాడిని. బెస్ట్ సాధించేందుకు విదేశాల్లో ప్రత్యర్థి రెజ్లర్లతో ప్రాక్టీస్ చేయాలనుకున్నా. ఇది ఒలింపిక్స్ సన్నద్ధతను మరింత పెంచేది. కానీ ట్రయల్స్ వల్ల దేనిపై దృష్టి సారించలేక పోతున్నా’ అని అమన్ ఆవేదన వ్యక్తం చేశాడు.