బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని గ్రామ పంచాయతీలను శివారు మున్సిపాలిటీల్లో విలీన విషయమై ప్రభుత్వం విపక్షాలను సంప్రదించకపోవడం సరికాదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద పేర్కొన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకున్నామని, ఇప్పడు 51 గ్రామాలను శివారు మున్సిపాలిటీ ల్లో కలపాల్సిన తొందర ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఇంత పెద్ద నిర్ణయం హడావుడిగా ఎందుకు తీసుకున్నారని, ఎవరితో చర్చించారో సమాధానం చెప్పాలన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతింటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చించకుండా నిర్ణయం తీసుకోవడం ప్రజా పాలనకు విరుద్ధమన్నారు. సీఎంకు అవగాహన లేకపొతే మున్సిపల్ శాఖ బాధ్యతలను వేరొకరికి అప్పగించాలని సూచించారు. గ్రామపంచాయతీలను మున్సిపాలిటీల్లో కలపడం వల్ల ప్రజలపై భారం పడుతుందే తప్ప, జరిగే అభివృద్ధేమి లేదన్నారు.
టోక్యో లాంటి మహా నగరాల్లో 22 మున్సిపాలిటీలే ఉన్నాయని గుర్తు చేశారు. మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనాన్ని ఆపి, అఖిలపక్ష సమావేశం తర్వాత నిర్ణయం తీసుకోవాలన్నారు. కేబినెట్ సబ్ కమిటీ సమావేశాలకు ప్రతిపక్ష నేతలను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గ్రామాల విలీనానికి సంబంధించి ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఒక్క మీటింగ్‌తోనే ఎలా నిర్ణయం తీసుకుంటుందని మండిపడ్డారు. ఇది ప్రజల హక్కులను కాలరాయడమేనన్నారు. వెంటనే ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.