calender_icon.png 8 October, 2024 | 3:50 AM

నిత్యం రైతుల్లోనే.. నిరసన ఎక్కడ?

08-10-2024 02:04:16 AM

మాపై అసంతృప్తి ఉంటే ఆ సెగ తాకేది కదా 

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

‘మంత్రులతో ముఖాముఖి’కి హాజరు  

హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉంటే నిరసన సెగ తమకు తాకేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గాంధీభవన్‌లో నిర్వహించిన ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమంలో భాగంగా ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. అధికారం కోల్పోయిన బాధ ఒకరిదని, అధికారంలోకి రావాలనే బాధ మరొకరిదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో రైతులకు రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేసింది ప్రధాని మోదీకి, బీజేపీకి కన్పించడం లేదా అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేశారా? అని నిలదీశారు.

రుణమాఫీ పూర్తి కాగానే రైతు భరోసా నిధులు వేస్తామని స్పష్టంచేశారు. బీఆర్‌ఎస్ కావాలనే ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో బీఆర్‌ఎస్ పార్టీ ప్రపంచాన్ని మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పటికే 22 లక్షల మందికి రైతు రుణమాఫీ చేశామని, ఇంకా 20 లక్షల మంది రైతులకు చేయాల్సి ఉందని చెప్పారు.

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారని అభినందించారు. గాంధీభవన్‌లో మంత్రులు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయడం ప్రజాపాలనకు నిదర్శమని చెప్పారు. బుధవారం ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమంలో భాగంగా గాంధీభవన్‌లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అందుబాటులో ఉంటారు.