calender_icon.png 1 February, 2025 | 10:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరోపకారం

01-02-2025 12:00:00 AM

ఒక ఆశ్రమంలో గురువు గారి వద్ద అజేయుడు, విజయుడు అనే ఇద్దరు రాకుమారులు విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. గురువుగారు వారిద్దరికీ ఒక పరీక్ష పెట్టదలచి, వారిని దగ్గరకు పిలిచి ఇలా చెప్పారు. ‘నాయనలారా మన ఆశ్రమానికి చాలా దూరంలో ఉన్న ఆటవికుల గుహల్లో ఒక అరుదైన మణి ఉంది దాన్ని ఎవరు ముందుగా తెచ్చిస్తే వారే మీ ఇద్దరిలో విజేత. ఈ మాటలు విన్న రాకుమారులు ఇద్దరూ వెంటనే బయల్దేరి ఆటవికుల గుహల వైపు ప్రయాణం సాగించారు.

దారిలో వారికి బాగా దెబ్బలు తగిలి కింద పడిపోయిన ఒక వ్యక్తి కనిపించాడు. ఇతనితో మనకెందుకు విజయా పోదాం పద అని అజేయుడు ముందుకు వెళ్లిపోయాడు. విజయుడు మాత్రం ఆగి, అతనికి సపర్యలు చేసి, మంచినీళ్లు తాగించి, అతని నివాసం వద్ద వదిలేశాడు. కొంచెం సేపటి తర్వాత అజేయుడు, విజయుడు ఆటవికుల గుహల వద్ద కలిశారు. విజయుడు ఆ ఆటవికులతో చక్కగా మాట్లాడి గురువుగారు చెప్పిన మణినివారి దగ్గర నుంచి తీసుకున్నాడు.

అంత సులువుగా మణిని ఎలా ఇచ్చారు? వీరు చాలా క్రూరులు అని గురువుగారు చెప్పారే అని విజయుడిని అడిగాడు అజేయుడు. దారిలో మనకు దెబ్బలు తగిలి కనిపించిన బాటసారి వీరి చేతిలో దెబ్బలు తిన్నవాడే. అతన్ని నేను కాపాడినందుకు కృతజ్ఞతగా ఆటవికులతో ఎలా మాట్లాడితే మణి దొరుకుతుందో చెప్పాడు.

ఆపదలో ఉన్న వారికి మనం సాయం చేస్తే, మనకు కూడా మంచిదే, దేవుడు మనకు మరొక వైపునుంచి సాయం పంపుతాడు అన్నాడు విజయుడు. గురువుగారు విజయుడిని విజేతగా ప్రకటించి, ఆ ఇద్దరి పరోపకారి బుద్ధిని అభినందించాడు.