ఐవోఏకు బీసీసీఐ 8.5 కోట్లు
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి ముం దు.. మన అథ్లెట్లకు భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) మద్దతుగా నిలిచింది. విశ్వక్రీడల్లో పాల్గొనే అథ్లెట్ల కోసం బీసీసీఐ ఆదివారం భారత ఒలింపిక్ సంఘానికి (ఐవోఏ) రూ. 8.5 కోట్లు అందజేసింది. ఈ మేరకు బోర్డు సెక్రటరీ జై షా వివరాలు వెల్లడించాడు. ‘పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అథ్లెట్లకు బీసీసీఐ అండగా ఉంటుంది. అందుకోసం ఐవోఏకు ఎనిమిదిన్నర కోట్లు అందిస్తున్నాం’ అని జై షా సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ఈ నెల 26 నుంచి విశ్వక్రీడలు ప్రారంభం కానుండగా.. భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు.