పీవో రాహుల్....
భద్రాచలం (విజయక్రాంతి): విద్యార్థినీ విద్యార్థులు చదువుతో పాటు పర్యావరణంపై అవగాహన పెంచుకొని వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు తమ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి బి.రాహుల్(ITDA Project Officer B.Rahul) విద్యార్థినీ విద్యార్థులకు సూచించారు. బుధవారం నాడు భద్రాచలంలోని బీఈడీ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు సబ్బులు, ఇతర ద్రవాల తయారీపై నిర్వహించిన వర్క్ షాప్ లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులకు కొన్ని సూచనలు ఇస్తూ చిన్నతనం నుండి విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన అవసరమని, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా విద్యార్థులు అర్థం చేసుకొని పర్యావరణానికి హాని కలగకుండా చూడాలని అన్నారు. నిత్యజీవితంలో ఉపయోగపడే వివిధ అంశాలపై విద్యార్థులు దృష్టి పెట్టాలని, కేవలం తరగతి గదికే పరిమితం కాకుండా బాహ్యంగా జరిగే అనేక మార్పులను కూడా విద్యార్థులు గమనించాలని ఆయన సూచించారు.
అభివృద్ధి చెందుతున్న దేశాల సైతం ప్రకృతి పరంగా ఎదురైన సమస్యలను పరిష్కరించడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. మానవుని వికృత శ్రేష్టల వల్ల, స్వార్థం వల్ల ప్రకృతికి తీవ్ర విఘాతం ఏర్పడి వాతావరణం ఋతువుల్లో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ప్రకృతికి అనుగుణంగా మన విధివిధానాలలో మార్పులు చేసుకోవాలని, పాఠశాలల్లో, మనం నివసించే గృహాల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, వర్క్ షాప్ లో నేర్చుకున్న అంశాలు అన్నీ కూడా తమ పాఠశాలలోని విద్యార్థులకు ఉపాధ్యాయులకు నేర్పించాలని సూచించారు. అనంతరం జిల్లా సైన్స్ అధికారి సరస్వతి చలపతి రాజు మాట్లాడుతూ... నేషనల్ గ్రీన్ కార్డ్స్ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి వివరించారు.
ఎంపిక చేసిన 50 పాఠశాలలకు చెందిన బాలికలు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్జిసి, ఏసిఓ రాజశేఖర్ వర్క్ షాప్ లో జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల బాల బాలికలకు సబ్బులు, హ్యాండ్ వాష్ లిక్విడ్, డిష్ వాష్ లిక్విడ్ ఎలా తయారు చేయాలో అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు ఉచితంగా టీ షర్ట్స్, టోపీలు, నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ మణెమ్మ, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యం వీర నాయక్, మండల విద్యాశాఖ అధికారిని టి. రమ, ఏసీఎంఓ రమణయ్య, జిల్లా ఎన్జీసి కోఆర్డినేటర్ బి. సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.