calender_icon.png 24 November, 2024 | 2:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టాతో పాటు నైపుణ్యం కలిగి ఉండాలి

14-11-2024 03:02:41 AM

హెచ్‌సీయూ వీసీ ప్రొఫెసర్ బీజేరావు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 13(విజయక్రాంతి): విద్యార్థులు డిగ్రీ పట్టాతో పాటు నైపుణ్యం కలిగి ఉండాలని, అప్పుడే అవకాశాలు అందుకోగలరని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ జేబీరావు(బాసుత్కర్ జగదీశ్వర్‌రావు) పేర్కొన్నారు. బుధవారం రవీంద్రభారతి ఆడిటోరియంలో జరిగిన నిజాం కాలేజీ స్నాతకోత్సవానికి ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగారంతో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా వీసీ జేబీరావు మాట్లాడుతూ ఆకాశమే హద్దుగా విద్యార్థులు ఎదగాలని పిలుపునిచ్చారు. తాము చదువుకున్న విద్యాసంస్థలను, ప్రాంతాన్ని, తల్లిదండ్రులను మర్చిపోవద్దని, సమాజం పట్ల బాధ్యత చూపాలన్నారు. ఓయూ వీసీ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులే భావి ఆవిష్కర్తలు, నాయకులని అన్నారు. నిజాం కాలేజీతో పాటు, ఓయూలో పెరుగుతున్న విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా హాస్టల్ వసతి కల్పిస్తామని చెప్పారు.

నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బీమా మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా తమ కాలేజీలో కోర్సులను ప్రవేశపెట్టి విద్యార్థులకు ఉత్తమ విద్యనందిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ డిగ్రీ కోర్సుల్లో మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు అతిథులు గోల్డ్‌మెడల్స్‌ను ప్రదానం చేశారు. 520 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఓయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ ఎం రాములు, నిజాం కాలేజీ వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జీ ఉపేందర్‌రెడ్డి, అధికారులు డాక్టర్ చాంద్‌పాషా, డాక్టర్ పసునూటి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.