- ఆరోగ్యం సరిగా లేదన్నా కనికరించని అధికారి
- గుండెపోటుతో విద్యుత్ ఉద్యోగి మృతి
కామారెడ్డి, అక్టోబర్ 29 (విజయక్రాంతి): తన ఆరోగ్యం బాలేదని ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నాడు.. అనారోగ్యంతో ఉన్న తల్లికీ సేవ చేయాలని విజ్ఞప్తిచేశాడు.. అయినా ఉన్నతాధికారులు కరుణించలేదు.. దీంతో బదిలీ అయిన ఓ విద్యుత్ అధికారి గుండె ఆగిపోయిన విషాద ఘటన ఆర్మూర్ డివిజన్‌లోని బట్టపూర్‌లో చోటుచేసుకుంది.
విద్యుత్‌శాఖ డివిజన్ అధికారి ఒంటెద్దు పొకడతో బట్టాపూర్‌లో ఎఎల్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న శ్రీరాములు సోమవారం గుండెపోటుతో మృతిచెందారు. విద్యుత్ శాఖలో ఇటీవల బదిలీల ప్రక్రియ చేపట్టారు. ఉద్యోగుల నుంచి ఆప్షన్ స్వీకరించిన ఉన్నతాధికారులు ఆ తరువాత బదిలీలను పూర్తిచే శారు.
ఆర్మూర్ సబ్‌స్టేషన్‌లో సేవలు అందిస్తున్న శ్రీరాములుకు ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. ఆయన తల్లి కాన్సర్‌తో బాధపడుతోం ది. తన పరిస్థితి బాగాలేదని డీఈఈ దృష్టికి తీసుకెళ్లాడు. ఆర్మూర్‌లోనే ఏదైనా సబ్‌స్టేషన్‌లో విధులు కేటాయించాలని ప్రాధేయపడ్డాడు.
అయి నా ఆ ఉన్నతాధికారి కనికరించలేదు. ఫీల్డ్‌లో పనిచేయాలని ఆదేశించాడు. ఫీల్డ్ వర్క్ తనతో కాదని యూనియన్ నేతతో చెప్పగా అతడూ బుకాయించాడు. సోమవారం తల్లిని చికిత్స నిమిత్తం హైదారాబాద్‌కు తీసుకెళ్లిన శ్రీరాములు.. గుండెపోటుతో అక్కడే మృతిచెందాడు.