హైదరాబాద్,(విజయక్రాంతి): ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను సంధ్య థియేటర్ ఇష్యూ వెంటాడుతుంది. మంగళవారం సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో విచారణకు అల్లు అర్జున్ కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరుకానున్నారు. ఈ కేసుపై బన్నిని ఇవాళ ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పీఎస్ కు రావాలని నిన్న పోలీసులు నోటీసులు అందించారు. పోలీసులు ఇచ్చిన నోటీసులపై తన లీగల్ టీమ్ తో భేటీ అయి సోమవారం అర్థరాత్రి వరకు చర్చించారు.
సంధ్య థియేటర్ ఘటనపై ఇప్పటికే పోలీసులు విడుదల చేసిన 10 నిమిషాల వీడియో ఆధారంగా, బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మిట్ లో ప్రస్తామించిన అంశాలపైనా ప్రశ్నించే అవకాశం ఉంది. అల్లు అర్జున్ విచారణ దృష్ట్యా చిక్కడపల్లి పీఎస్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన వాహనాల రాకపోకలను నిలిపివేసి పోలీసు స్టేషన్ కు 200 మీటర్ల దూరం నుంచి ఆంక్షలు విధించారు. ఇప్పటికే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి అతని ఇంటికి చేరుకున్నారు.