హైదరాబాద్,(విజయక్రాంతి): ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్(Allu Arjun), ఎఫ్డీసీ ఛైర్మన్, సినీ నిర్మాత దిల్ రాజు సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రి(KIMS Hospital)కి చేరుకున్నారు. డిసెంబర్ 4వ తేదీన సంధ్య థియేటర్ వద్ద జరిగిన తోక్కిసలాట ఘటనలో దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడాడు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అర్జున్ మంగళవారం పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి, వైద్య సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్న బాలుడి తండ్రి భాస్కర్ తో కూడా మాట్లాడారు.
సూమారుగా 20 నిమిషాలపాటు ఆసుపత్రిలోనే ఉన్నారు. తనపై కేసు నమోదైన కారణంగా బాలుడిని పరామర్శించేందుకు వెళ్లొద్దని లీగల్ టీమ్ చెప్పినట్లు ఇటీవల అల్లు అర్జున్ మీడియా సమావేశంలో వెల్లడించారు. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ తోపాటు సినిమా నిర్మాత సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, దర్శకుడు సుకుమార్ కలిసి మొత్తం రూ.2 కోట్ల చెక్కను ఇటీవల దిల్ రాజ్ ద్వారా ఆ కుటుంబానికి అందించారు. తాజా కిమ్స్ ఆసుపత్రి బన్నీ వస్తున్నట్లు పోలీసులకు ముందుగానే సమాచారం అందించడంతో ఆసుపత్రి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.