హైదరాబాద్: సంధ్య 70 ఎంఎం థియేటర్ తొక్కిసలాట కేసులో పుష్ప 2 స్టార్, ప్రముఖ తెలుగు సినీ నటుడు అల్లు అర్జున్(Allu Arjun)కు నాంపల్లి కోర్టు శుక్రవారం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. తొక్కిసలాట ఘటనకు సంబంధించి డిసెంబర్ 13న అల్లు అర్జున్ అరెస్ట్ కాగా, తెలంగాణ హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పై విడుదలయ్యాడు. 50 వేల పూచీకత్తుతో పాటు రెండు సాక్షి సంతకాలతో నాంపల్లి కోర్టు(Nampally Court) రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో ఇప్పటికే హైకోర్టు ఆయనకు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇదే కేసులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై చిక్కడపల్లి పోలీసులు(Chikkadpally Police) నాంపల్లి కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో అల్లు అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేదని అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. రేవతి మృతికి సంబంధించి పోలీసులు నమోదు చేసిన బీఎన్‌ఎస్ సెక్షన్ 105 తనపై వర్తించదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు.