ఎంబీఏలో 24,457.. ఎంసీఏలో 5,843 సీట్లు భర్తీ
ఈ నెల 17 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్‌కు గడువు
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ మొదటి విడత సీట్లను విద్యార్థులకు శుక్రవారం అధికారులు కేటాయించారు. రాష్ట్రంలోని 285 ఎంసీఏ, ఎంబీఏ కాలేజీల్లో మొత్తం 34,748 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయి తే వీటిలో 30,300 సీట్లను మాత్రమే కేటాయించారు. ఎంబీఏలో 24,457 (87.5 శాతం) సీట్లు, ఎంసీఏలో 5,843 (86 శాతం) సీట్లు భర్తీ కాగా, ఇంకా 4,448 సీట్లు మిగిలాయి. 91 కాలేజీల్లో 100 శాతం సీట్లు నిండాయి.
ఎంబీఏలో 3,494 సీట్లు, ఎంసీఏలో 954 సీట్లు మిగిలాయి. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 1,130 మంది విద్యార్థులకు సీట్లు దక్కాయి. ఐసెట్‌లో 71,647 మంది విద్యార్థులు అర్హత సాధించగా, అందు లో 35,033 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో పాల్గొన్నారు. 34,069 మంది వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 17వ తేదీలోపు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు. ఫీజు చెల్లించిన వారు ఈనెల 25 నుంచి 28వ తేదీలోపు కాలేజీల్లో ధ్రువపత్రాలను సమర్పించాలని తెలిపారు.