calender_icon.png 31 October, 2024 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమార్కులకే మళ్లీ ధాన్యం కేటాయింపు

31-10-2024 01:01:32 AM

బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): రాష్ట్రం లో పాలన గాడితప్పిందని, అభివృద్ధి పనుల పేరుతో కాంట్రాక్టులు, కమిషన్ల దందా నడుస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. జీవోలను కూడా పబ్లిక్ డొమైన్‌లో పెట్టడం లేదని వాపోయారు. కేవలం ఢిల్లీ పెద్దలకు ముడుపులు పంపడమే తప్పా ప్రజలకిచ్చిన హామీలపై చిత్తశుద్ధి లేదన్నారు.

బుధవారం బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రూ.1,150 కోట్ల సివిల్ సప్లయ్ కుంభకోణంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు. అక్రమాలకు పాల్పడిన మిల్లర్ల నుంచి రికవ రీ చేయకుండా మళ్లీ వారికే ధాన్యం కేటాయిస్తున్నారని మండిపడ్డారు. దీని వెనుక ఉన్న చీకటి ఒప్పందం ఏమిటని నిలదీశారు.

సీఎం, మంత్రుల ప్రమేయం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలకులు మిల్లర్ల నుంచి భారీగా ముడుపులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో జీవో ఎంఎస్ 27 తీసుకొచ్చి అక్రమాలకు పాల్పడిన మిల్లర్లకే బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడం వెనుకున్న మతలబేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

రూ.20 వేల కోట్ల ధాన్యం మిల్లర్ల నుంచి రావాల్సి ఉందని చెప్పిన పౌర సరఫరాల శాఖ మంత్రి ఎందుకు రికవరీ చేయడం లేదని ప్రశ్నించారు. మిల్లర్లు, కాంట్రాక్టర్ల డీ ఫాల్టర్ల లిస్టును బయట పెట్టమంటే ప్రభుత్వం బయటపెట్టడం లేదన్నారు. సన్న బియ్యం నిబంధనల అమలు సాధ్యం కాదని మిల్లర్లు చెప్పినా ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూడటం లేదని అన్నారు.