calender_icon.png 1 November, 2024 | 10:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్టా నీటి కేటాయింపులు

17-07-2024 04:54:11 AM

  • తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు అనుమతి 
  • తెలంగాణకు 5.4 టీఎంసీలు, ఏపీకి 4.5 టీఎంసీలు

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాల కోసం కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. త్రిసభ్య కమిటీ నిర్ణయం మేరకు మంగళవారం ఆదేశాలిచ్చింది. శ్రీశైలం నుంచి పవర్‌హౌస్‌ల ద్వారానే నీరు విడుదల చేయాలని కేఆర్‌ఎంబీ పేర్కొంది. బుధవారం నుంచి నీటి విడుదలకు కేఆర్‌ఎంబీ అనుమతి ఇవ్వనుంది.

తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని వినియోగించాలని బోర్డు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. తాగునీటి అవసరాలకై నాగార్జునసాగర్ నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఏపీ గతంలో కోరిన తరుణంలో సోమవారం హైదరాబాద్‌లో బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి రాయిపురే, తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.

తాగునీటికే కేటాయింపులు

పల్నాడు, బాపట్ల, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం నాగ ర్జునసాగర్ నుంచి 5టీఎంసీల నీటిని విడుద ల చేయాలని ఏపీ గతంలో కృష్ణా బోర్డును కోరింది. ఆ ప్రతిపాదనపై త్రిసభ్య కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. అందుబాటు లో ఉన్న జలాలు, ఎగువ నుంచి ప్రవాహం వచ్చే అవకాశం, తదితర అంశాలపై సమాలో చనలు చేశారు. ఎగువ నుంచి ఇప్పటికి ప్రవాహాలు రాకపోయినా, కర్ణాటకలో ఆల్మట్టి, నారాయణపూర్‌లో ఉన్న నీటిమట్టం, జూరాలకు వస్తున్న ప్రవాహాన్ని చూస్తే పరిస్థితి ఆశాజనకంగానే ఉందని సమావేశంలో అభిప్రాయపడ్డట్లు సమాచారం.

సాగర్‌లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలను పరిగణలోకి తీసుకొని తాగునీటి కోసం నీరు విడుదల చేయాలని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి కోరారు. తమకు కూడా హైదరాబాద్ సహా జిల్లాల్లో తాగునీటి అవసరాలు ఉన్నాయని, నీరు విడుదల చేయాలని తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్ కోరారు. రెండు రాష్ట్రాల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న కేఆర్‌ఎంబీ శ్రీశైలం, సాగర్‌లో ఉన్న 9.914 టీఎంసీల నుంచి తెలంగాణకు 5.414, ఏపీకి 4.500 టీఎంసీలను కేటాయించింది.