calender_icon.png 25 October, 2024 | 4:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటాయింపులు సరే.. మంత్రులేరి?

29-07-2024 02:16:40 AM

  1. వ్యవసాయం తర్వాత సంక్షేమానికే నిధులెక్కువ
  2. ఎస్సీ, ఎస్టీ శాఖలకు ఇప్పటికీ మంత్రులు కరువు
  3. ఇలా అయితే పరిపాలన వికేంద్రీకరణ ఎలా?

హైదరాబాద్, జూలై 28 (విజయ క్రాంతి): వార్షిక బడ్జెట్‌లో రాష్ట్రప్రభుత్వం అన్ని శాఖలకు గణనీయంగా నిధులు కేటాయించింది. వ్యవసాయం రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఆ తర్వాత సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతోపాటు నిధుల కేటాయింపుల్లో తగిన ప్రాధాన్యం కల్పించింది. అన్ని సంక్షేమ శాఖలకు కలిపి రూ.65,119 కోట్లు నిధులు కేటాయించింది. అయితే ఈ నిధులు సక్రమంగా ఖర్చుచేయటానికి కొన్ని శాఖలకు మంత్రులే లేకపోవటం గమనార్హం. బీసీ సంక్షేమ శాఖకు పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉండగా, స్త్రీమూ|శిశు సంక్షేమ శాఖకు మంత్రిగా సీతక్క ఉన్నారు. ఇవి మినహా మిగిలిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు ఇప్పటికీ ప్రత్యేకంగా మంత్రులు లేరు. 

పరిపాలన వికేంద్రీకరణ అవసరం

ఏ రాష్ట్రం అగ్ర పథాన దూసుకుపోవాలన్నా అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా ముందుకెళ్లాలి. అయితే రాష్ట్రాభివృద్ధిలో సంక్షేమం కీలక పాత్ర పోషిస్తుంది. సంక్షేమ శాఖల ద్వారా ప్రజలందరికీ అన్ని విధాలా లబ్ధి చేకూరితేనే అట్టడగు వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుంది. అలా జరగాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలి. ఇందుకోసం ప్రభుత్వ రంగ శాఖలన్నింటికీ మంత్రులు ఉండటం అవసరం. ప్రతి శాఖకు కార్యనిర్వాహక వ్యవస్థ ఉన్నప్పటికీ విధాన పరమైన నిర్ణయాల్లో మంత్రివర్గం ఎంతో ముఖ్యం. సంబంధిత శాఖ మంత్రులు లేకపోవడంతో శాఖా పరమైన నిర్వహణ కుంటుపడుతున్నది. మంత్రులకు కేటాయించని శాఖలన్నింటికీ సీఎందే బాధ్యత ఉంటుందని తెలిసిందే. ఇన్ని శాఖలు నిర్వహించాలంటే సీఎం స్థానంలో ఉన్న రేవంత్‌రెడ్డిపై పనిభారమూ పెరుగుతుంది. అయితే వివిధ శాఖల్లోని పరిపాలనను పర్యవేక్షించడం వేరు.. స్వయంగా బాధ్యత వహించడం వేరు. దీని కారణంగా పనుల్లో జాప్యం జరిగే ప్రమాదం ఉంది. 

కేసీఆర్ బాటలోనే రేవంత్‌రెడ్డి

మంత్రివర్గ విస్తరణ అంశంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా మాజీ సీఎం కేసీఆర్ లాగానే వ్యవహరిస్తున్నారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్ కూడా కొద్దిరోజులు మంత్రివర్గ విస్తరణ చేయకుండానే ప్రభుత్వాన్ని నడిపించారు. 2018 డిసెంబర్ 13న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్, 2019 ఫిబ్రవరిలో మొదటి విడత మంత్రివర్గ విస్తరణ, 2019 సెప్టెంబర్‌లో రెండో విడత మంత్రివర్గ విస్తరణ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రేవంత్‌రెడ్డితో సహా 11 మంది మంత్రులతో మంత్రివర్గం ఏర్పాటైంది. ఇప్పటికే పలుమార్లు క్యాబినెట్ విస్తరణ ప్రకటన చేసినా పూర్తిస్థాయి క్యాబినెట్ మాత్రం కొలువు దీరలేదు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలకు ముందు కూడా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అంతా భావించినా అది జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటికే ఉన్న 11 మంది మంత్రులతోపాటు ఇంకా ఆరుగురిని మంత్రులుగా చేర్చుకునేందుకు అవకాశం ఉంది. అయితే మంత్రివర్గ విస్తరణ అంశంలో కాంగ్రెస్ అధిష్టానందే తుది నిర్ణయం కావడం కూడా ఆలస్యానికి కారణంగా చెప్పవచ్చు. 

సీఎం దగ్గరే చాలా శాఖలు

ప్రస్తుత ప్రభుత్వంలో కొన్ని కీలక శాఖలను మంత్రులకు కేటాయించినా ఇంకా చాలా శాఖలు సీఎం రేవంత్‌రెడ్డి చేతిలోనే ఉన్నాయి. కీలకమైన హోం, ఉన్నత విద్య, పట్టణాభివృద్ధి, పురపాలక, పశు సంవర్థక, కార్మిక శాఖ, ఎస్సీ సంక్షేమం, ఎస్టీ సంక్షేమం, మైనార్టీ సంక్షేమం, రెవెన్యూ(రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్), పాఠశాల విద్య శాఖలు సీఎం వద్దనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని శాఖలకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వం బాధ్యత వహించినప్పటికీ సంబంధిత శాఖ మంత్రి లేకపోవడం కొంత అసంపూర్ణంగా ఉంది. కనీసం అసెంబ్లీ సమావేశాల అనంతరమైనా పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరుతుందో చూడాలి.