- విశ్వనగరానికి రూ.50 వేల కోట్ల అంచనా
- ఒక్క రూపాయి ఖర్చు చేయని బీఆర్‌ఎస్ సర్కార్
- ప్రతిష్ఠాత్మక పథకాలన్నీ రెండేళ్ల కిందటే బంద్
- 2022 నివేదికలో కాగ్ వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకాన్ని సమర్థంగా అమలు చేయలేదని, పథకాలకు భారీగా నిధులు కేటాయించినా.. ఖర్చు చేయడంలో విఫలమైందని 2022 కంప్రోల్టర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకొన్న పథకాలన్నీ రెండేళ్ల కిందటే నిలిపేసిందని స్పష్టంచేసింది.
మూసీ ప్రక్షాళనకు 2020 21 నుంచి వరుసగా మూడేళ్లు బడ్జెట్‌లో నిధులు కేటాయించినా ఖర్చు చేయలేదని తెలిపింది. ౨౦౨౨ ఆర్థిక సంవత్సరంలో ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని చెప్పిన దళితబందు పథకం కింద ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని చెప్పింది. రైతుల మేలుకు వ్యవసాయ రంగానికి భారీగా ఖర్చు చేస్తున్నామని చెప్పి ఏటా కేటాయించిన మొత్తం కంటే రూ.4 వేల కోట్లు తక్కువ ఖర్చు చేసిందని పేర్కొంది.
విరాళాలు రూ.35 కోట్లు.. ఖర్చు రూ.15 కోట్లే
హరితహారం మొక్కల పెంపకానికి ప్రభుత్వ ఉద్యోగుల నుంచి రూ.35 కోట్ల హరిత నిధి విరాళాలను వసూలు చేసిన ప్రభుత్వం కేవలం రూ.15 కోట్లు ఖర్చు చూపించిందని, మిగతా నిధుల విషయాన్ని కాగ్ ప్రశ్నించింది. డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.11 వేల కోట్లు కేటాయించి అరకొరగా ఖర్చు చేసిందని తెలిపింది. గొర్రెల పంపిణీ పథకానికి రూ.1000 కోట్లు కేటాయించి ఒక్క పైసా ఇవ్వలేదని పేర్కొంది. రైతులకు రుణమాఫీ, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అన్నింటిదీ ఇదే పరిస్థితి అని స్పష్టం చేసింది.
మాటల్లోనే విశ్వనగరం
హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామని ఐదేండ్లలో రూ. 50 వేల కోట్లు అవసరమవుతాయని గత ప్రభుత్వం అంచనా వేసింది. 2020-21 బడ్జెట్‌లో మూసీ ప్రక్షాళన, మూసీ పరీవా హక ప్రాంత పథకం, ఇతర పథకాల పేరిట రూ.10 వేల కోట్లు ప్రతిపాదించిందని కాగ్ తెలిపింది. 2021-22లో 2,600 కోట్లు, 2022-23లో 200 కోట్లు కేటాయించినా ఖర్చు కాలేదని, పాతబస్తీకి మెట్రో మార్గానికి 500 కో ట్లు, విమానాశ్రయ మెట్రోమార్గానికి 378 కోట్లు కేటాయించినా పనులు ప్రారంభమవకపోవడంతో ఈ మొత్తా న్ని ఉపసంహరించుకున్నది.