24-03-2025 02:28:53 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ బడ్జెట్ లో హైదరాబాద్ నగరాభివృద్ధిపై కేటాయింపులు, నిధుల విడుదల ఘోరమని బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ బడ్జెట్ 2025 - 26 అసెంబ్లీ సమావేశంలో భాగంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇతర పద్ధులపై జరిగిన చర్చలో ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ హైదరాబాద్ నగరాభివృద్ధిపై బడ్జెట్ కేటాయింపులు, నిధుల విడుదలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వివేకానంద గౌడ్ మాట్లాడుతూ... గతంలో హైదరాబాద్ నగరానికి ప్రతీ సంవత్సరం రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ జీహెచ్ఎంసీకి రూ.2654 కోట్లు కేటాయించి రూ.1200 కోట్లను మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. హెచ్ఎండీఏకు రూ.2,500 కోట్లు కేటాయించి పైసా కూడా ఇవ్వలేదని, జలమండలికి రూ.3385 కోట్లు కేటాయిస్తే.. రుణాలకే రూ.800 కోట్లు ఇచ్చారని చెప్పారు.
మెట్రో ఇప్పటికే ప్రతిపాదించిన రూట్లను రద్దు చేశారని విమర్శించారు. మెట్రోకు రూ.1100 కోట్లు కేటాయిస్తే.. రూ.300 కోట్లు ఇచ్చారు. మూసీ ప్రాజెక్టుకు రూ.1500 కోట్లు కేటాయిస్తే కేవలం రూ.80 కోట్లు, ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ పేరుతో హంగామా చేస్తున్నారని వివేకానంద్ ఆగ్రహం వ్యక్తి చేశారు. ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న హైదరాబాద్‌ను విస్మరిస్తున్నారు. జీహెచ్ఎంసీకి రూ.7582 కోట్లు అడిగితే రూ.3100 కోట్లే కేటాయించారని తెలిపారు. ఈ విధంగా గతేడాది కేటాయించిన నిధుల్లో కేవలం 25 శాతమే విడుదల చేయడంపై నగరాభివృద్ధిపై ప్రభుత్వ చిత్తశుద్ధి కనిపిస్తుందని విరుచుకుపడ్డారు. సుంకిశాల ప్రాజెక్టు మరమత్తు కోసం అయ్యే ఖర్చు మేఘ కంపెనీయ్యే భరించాలని డిమాండ్ చేశారు. ఫార్ములా-ఈ రేసు కోసం రూ.50 కోట్లను వెచ్చించడానికి నిరాకరించిన ఈ ప్రభుత్వం నేడు మిస్ వరల్డ్, ఒలంపిక్స్ పోటీలు నిర్వహిస్తామనడం నమ్మసఖ్యంగా లేదని ఎమ్మెల్యే కేపీ వివేకానంద వెల్లడించారు.