08-04-2025 08:56:22 PM
ఘనంగా సన్మానించిన జిఎం కార్యాలయ సిబ్బంది..
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి ఏరియాలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ ఆలిండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ కు జాతీయ కార్యదర్శి (ఆఫీస్ బేరర్) గా అల్లి రాజేందర్ ఎన్నిక కావడం హర్షనీయమని ఏరియా జిఎం కార్యాలయ సిబ్బంది తెలిపారు. మంగళవారం ఏరియా జిఎం కార్యాలయంలో యూనియన్లకు అతీతంగా జిఎం కార్యాలయ సిబ్బంది అల్లి రాజేందర్ ను శాలువాతో ఘనంగా సన్మానించి, మిఠాయిలు పంచి పెట్టి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ... అల్లి రాజేందర్ సేవలను కొనియాడారు. అతి చిన్న వయస్సులో జాతీయస్థాయి నాయకుడిగా తమతో కలిసి పనిచేసే అల్లి రాజేందర్ ఎదగడం తమకు చాలా గర్వకారణమని తెలిపారు.
భవిష్యత్తులో సింగరేణి సమస్యలను కోల్ ఇండియా స్థాయిలో తీసుకు వెళ్లడానికి ఇది మరో మంచి అవకాశముందన్నారు. అనంతరం సన్మాన గ్రహీత అల్లి రాజేందర్ మాట్లాడుతూ.. ఆలిండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ లో జాతీయ కార్యదర్శిగా అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి ప్రతి విషయంలో తనకు తోడున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి కార్మికుడు ఏదైనా ఒక కార్మిక సంఘంలో పనిచేస్తూ, కార్మిక సంఘాల బలోపేతం చేసుకొని, మనకున్న సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా తమ వంతు పనిచేస్తూ, యాజమాన్యంపై పోరాడుతూ, కార్మికులను చైతన్యవంతం చేయాలన్నారు. ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని, భవిష్యత్తులో ఐక్య పోరాటాలు ఉంటాయని, అందరూ కలిసి యూనియన్లకు అతీతంగా పోరాడితే సమస్యలను పరిష్కరించుకోగలుగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిఎం కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.