30-03-2025 05:38:41 PM
మందమర్రి (విజయక్రాంతి): ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐసిడబ్ల్యూఎఫ్) ఆఫీస్ బేరర్ గా పట్టణానికి చెందిన సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) బ్రాంచ్ కార్యదర్శి అల్లి రాజేందర్ నియమితులయ్యారు. గత మూడు రోజులుగా జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో నిర్వహించిన మహాసభలకు సింగరేణి నుండి 30 మంది సిఐటియు యూనియన్ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ మహాసభలలో ఆఫీస్ బేరర్ లను ఎన్నుకోగా, యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డిని ఉపాధ్యక్షుడిగా, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వేజ్ బోర్డు కమిటీ సభ్యుడు మంద నరసింహా రావును కార్యదర్శిగా, యూనియన్ మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి అల్లి రాజేందర్ ను ఆఫీస్ బేరర్ గా ఎన్నుకున్నారు.
వీరితో పాటు మరో ఎనిమిది మందికి వర్కింగ్ కమిటీలో స్థానం కల్పించారు. ఈ సందర్భంగా యూనియన్ బ్రాంచ్ అధ్యక్షుడు సాంబారు వెంకటస్వామి మాట్లాడుతూ... రానున్న రోజుల్లో నూతన ఆఫీస్ బేరర్ల నాయకత్వంలో యూనియన్ నిర్మాణం పెంచే విధంగా కమిటీ పని చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మందమర్రి నుండి అల్లి రాజేందర్ ను ఏఐసిడబ్ల్యూఎఫ్ ఆఫీస్ బేరర్ గా ఎన్నుకున్నందుకు ఫెడరేషన్ కమిటీకి, సిఐటియు రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బ్రాంచ్ ప్రతినిధికి ఫెడరేషన్ లో అవకాశం కల్పించడం హర్షనీయమన్నారు. రానున్న రోజుల్లో రాజేందర్ మరింత ఉన్నత స్థానానికి ఎదిగి, యూనియన్ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అల్లి రాజేందర్ కు బ్రాంచ్ తరపున శుభాకాంక్షలు తెలిపారు.