భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని ఈ కనకదుర్గ దేవస్థానం(పెద్దమ్మ గుడి) ఆవరణలో శివాలయం ప్రతిష్ట, ధ్వజ స్తంభం ప్రతిష్ట మహోత్సవాలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని ఆరోపణలు వెలబడుతున్నాయి. శుక్రవారం ఆలయ అధికారులు జలధివాసం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జలధివాసానికి విచ్చేసే మహిళా భక్తులను పసుపు రంగు వస్త్రాలు ధరించి రావాలని సూచించారు. ఈ కార్యక్రమానికి హాజరైన భక్తులకు కనీసం తీర్థ ప్రసాదాలు ఇవ్వలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ప్రతిష్ట మహోత్సవ పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈవో దంపతులు పాల్గొనాలి.
కానీ ఆలయ ఈవో వీడో కావడంతో ఆలయంలోని సీనియర్ అసిస్టెంట్ స్థాయి అధికారుల దంపతులు, జిల్లాస్థాయి ఉన్నతాధికారుల దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఆలయ ఈవో ఏకపక్ష నిర్ణయంతో కొడుకు కోడలు పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారని ఆ శాఖకు సంబంధించిన కొందరు ఉద్యోగులు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. శివాలయం పక్కన నూతనంగా నిర్మించిన నిత్య అన్నదాన సత్రం కళ్యాణమండపం దాతను ఆహ్వానించలేదని సమాచారం. శివాలయంలో నూతనంగా ప్రతిష్ట చేయనున్న శివపరివార విగ్రహాలకు శాస్త్ర ప్రకారం పూజలు నిర్వహించే అర్చకుల్లో అనర్హులకు పెద్దపీట వేశారని ఆరోపణలు ఉన్నాయి.
దేవాదాయ శాఖ చట్టం, నిబంధనల ప్రకారం ఏదైనా అవయవ లోపం ఉన్న అర్చకులు గర్భగుడిలోనికి ప్రవేశానికి నిషిద్ధం. గతంలో వరంగల్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత రావు గణేష్ టెంపుల్ సందర్శించిన సమయంలో అవయవ లోపం ఉన్న రాధాకృష్ణ అర్చకులను గర్భగుడిలో పూజలు చేయవద్దని గేటు దగ్గర భక్తులకు తీర్థప్రసాదాలు ఇవ్వాలని ఆదేశించారు. కానీ పెద్దమ్మ గుడి ఆలయ ఈవో డిప్యూటేషన్ పై రాధాకృష్ణను పాల్వంచ ఆలయానికి పిలిపించి శాస్త్రపరంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడంలో పెద్దపీట వేయడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. జిల్లాస్థాయి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఈ ఘటనలపై విచారణ కాల్ చేసి ఉంచారని సమాచారం.