25-04-2025 04:22:01 PM
అర్హుల ఎంపికలో గ్రామ కమిటీల నాయకుల మధ్య... సయోధ్య
ఇళ్ల పేరు నమోదు కోసం.. జోరుగా డబ్బులు అడుగుతున్నట్లు ఆరోపణలు..
ఎంపిక ప్రక్రియలో మండల అధికారులు చేతులెత్తేసిన... వైనం
తుంగతుర్తి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన పథకానికి ఆదిలోనే భంగపాటు కలిగే విధంగా గ్రామాల్లో స్థానిక నాయకుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో లొల్లి... లొల్లిగా మారింది. ప్రభుత్వ అధికారులు ప్రజాపాలన కార్యక్రమములో పేద ప్రజలంతా దరఖాస్తు చేసుకోగా మొదటి దశలో గ్రామపంచాయతీ గోడలపై పేర్లు పెట్టి దరఖాస్తు చేసుకున్న పేర్లను పొందుపరచడం బాగానే ఉన్నది. అనంతరం ప్రభుత్వం గ్రామ కమిటీలను ఏర్పాటు చేయగా, అసలు ఇబ్బందులు ఇక్కడినుండే మొదలైనట్లు గ్రామంలోని పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు.
గ్రామాల్లో ఏ సందులో చూసిన నీకు వచ్చిందా పేరు.. నాకు వచ్చిందా.. నా పేరు రాయి.. రాయండి అనే గ్రామ కమిటీ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు.. గ్రామాల్లో స్థానిక ప్రభుత్వ అధికారులు ఇచ్చిన లిస్టు కూడా తప్పుల తడాఖా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం మండలాల్లో కట్టిన ఇల్లు నేటి వరకు పంపిణీ చేయకపోవడం దురదృష్టకరమైన విషయం. నేడు గ్రామాల్లో ఆ ఇండ్లు శిథిలావస్థకు చేరుకొని పశువులు పందులకు పెంపకానికి నిలయంగా మారింది. గ్రామాల్లో అర్హులైన అసలే ఇల్లు లేనటువంటి వ్యక్తులకు ఇందిరమ్మ ఇల్లు లభించేనా ...అన్న దీనస్థితికి చేరుకుంది. ఎంపిక ప్రక్రియలో కొందరు నాయకులు మొహమాటం లేకుండా డబ్బులు అడుగుతున్నట్లు పార్టీ కార్యకర్తల గుసగుసలాడుతున్నారు. జరుగుతున్న సంఘటనపై స్థానిక మండల అభివృద్ధి అధికారి, స్థానిక సిబ్బందితో పర్యవేక్షణ చేయించి అర్హులైన పేదవాన్ని గుర్తించి,పేరు నమోదు చేసే విధంగా కృషి చేయాలని పేర్కొంటున్నారు. జరుగుతున్న సంఘటనపై స్థానిక ఎమ్మెల్యే విచారణ జరిపించాలని, అర్హులైన పేద ప్రజలు కోరుతున్నారు.