బెల్లంపల్లి (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో బెల్లంపల్లి పట్టణంలోని కార్మిక వాడల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసి కార్మిక కుటుంబాలను ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని బుధవారం మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య అన్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ పై మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. బుధవారం సాయంత్రం పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో మాట్లాడారు.
కార్మికుల క్వార్టర్లకు గతంలో సింగరేణి యాజమాన్యం విద్యుత్ సరఫరా నిలిపివేస్తే ఎమ్మెల్యే వినోద్ సంస్థ సీ అండ్ ఎండి తో మాట్లాడి విద్యుత్ ను పునరుద్ధరించేలా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. రెండు రోజుల కిందట సింగరేణి అధికారులు బెల్లంపల్లి పట్టణంలోని కార్మికుల క్వార్టర్లకు విద్యుత్ కనెక్షన్లను తొలగిస్తే కూడా సి అండ్ ఎం డి, మందమర్రి జిఎం లతో మాట్లాడి మార్చి 31 వరకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని సూచించినట్లు తెలిపారు. ఇందుకు సింగరేణి జిఎంతోపాటు విద్యుత్తు అధికారులు అంగీకరించినట్లు ఆయన తెలిపారు. అనవసరంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఎమ్మెల్యే గడ్డం వినోద్ పై అబద్ధపు ఆరోపణలు చేయవద్దన్నారు.