16-03-2025 01:10:18 AM
శ్రీశంకరుల భజగోవిందమ్ వారి శిష్యులను తీవ్రంగా ప్రభావితం చేసింది. గురువు బోధించిన దానికి కొనసాగింపుగా వారందరూ జీవన పరిసత్యాలను, తాత్త్విక చింతనను, లోకరీతులను, మానవ స్వభావాలను, కపట గురువుల వైనాలను, భగవంతుని దివ్యత్వాన్ని, ఆయన సర్వ వ్యాపకత్వాన్ని, సరళంగా, గంభీరంగా బోధించారు. శ్రీ పద్మపదాచార్యులు, తోటకాచార్యులు, హస్తామలకుడు, సుబోధుడు, యోగానందుడు, ఆనందగిరి వంటి సమర్థ శిష్యుల ఆలోచనలన్నీ గురుదేవుల భావనలకు ప్రతిబింబాలే! ప్రతిధ్వనులే!
సజ్జన సాంగత్యం మనిషిని సంసార సాగరాన్ని దాటమని స్పష్టంగా బోధిస్తుంది. వేషం కట్టిన వాడు నటగురువే! విషయం బోధించే వాడే నుత గురువు. శరీరం శిథిలావస్థకు చేరుకున్నా ఆశాపాశం తెగక పోతే ఎట్లా? ముసలితనం ముంచెత్తినా, ఇంద్రియాలన్నీ ముడుచుకు పోయినా, మరణాన్ని గురించి తీవ్ర ఆలోచన పీడిస్తున్నా, బాహ్య సాధనలను వదలుకోకుండా ప్రపంచాపేక్ష తుం చుకోకపోతే ఎట్లా?
జ్ఞానం లభించకపోతే కైవ ల్యం లభించదు. సముద్ర, నదీస్నానాలు, వ్రత దానాదు లు మనసును నిర్మలం చేస్తాయే కాని ముక్తి ని ఇవ్వవు. అవి కేవలం ముక్తికి మార్గాలే. ‘చెట్టు నీడే భద్ర భవనం. నేలే భవ్య శయ్య. అరచేయే పాత్ర. జింక చర్మమే పట్టుబట్ట. పళ్ళే పరమాన్నం. నదిలో నీళ్ళే అమృతం... ఈ విధంగా జీవించే నిత్యతృప్తుడే నిత్యసుఖి!
భగవద్గీతా పఠనం, గంగాజల పానం, గోవింద స్మరణం అధ్యాత్మ పురోగమనానికి సాధనలు. పుట్టటం, ఉండటం, పోవటం ఇదొక విచిత్ర జన్మచక్రం. ఎన్నిసార్లు జరిగినా, ఏమీ మిగల్చని ఆట. తప్పని, తప్పించుకోలేని, అక్కరకు రాని పరుగు. భగవంతుని కృపతో తప్పించుకోవాలి. పసివాడు, ఉన్మత్తుడు, అవధూత ఈ ముగ్గురూ ప్రపంచంలో వున్నా భయమెరుగని వారు. వారి చిత్తం అత్యంత సహజంగా బ్రహ్మంతో కూడి వుంటుంది. అందువల్లనే వారు ఆనంద స్వరూపులు.
ప్రాపంచిక విషయాలను వదిలి తత్త్వవిచారణ చేయాలి. సమచిత్తమే దివ్యయోగం. అంతటా వున్నది దైవమే శత్రు మిత్రభావం వదిలిపెట్టి ఆత్మదర్శనం చేయాలి. అరిషడ్వర్గాలను హరిమయం చేయాలి. ఈ విధంగా సాగిన శిష్యుల ఆలోచనలకు ఆచార్య శంకర హృదయం ఆనంద సాగరమైంది. పదునాలుగు కోణాలలో విచ్చుకున్న శిష్య హృదయాలు, వారి అనుగ్రహ పాత్రమైనయ్. భగవత్పాదులు శిష్యులనూ, సర్వప్రపంచాన్ని ఆశీర్వచనామృత వృష్టిలో ముంచెత్తుతున్నారు సానందంగా!
“గీతాధ్యయనం, సహస్రనామ గానం, రూప ధ్యానం, సత్సంగం, సత్సాంగత్యమూ, పరిదీనులకు దానమూ చేయండి. భోగ, రోగాలు వదులుకుని యోగంలో వుండండి.”
డబ్బు పాపిష్టిది కాదు. పాపిష్టి వాడి చేతిలో డబ్బు వుంటే ప్రమాదం. డబ్బు మనుషులను విడదీస్తుంది. అనర్థానికి మూలం అదే! పరిమితి ఎరిగి సంపాదించండి. పాత్రత ఎరిగి వినియోగించండి. ఇంద్రియ నియంత్రణ, ఏది నిత్యం, ఏది సత్యం అనే విచారణ, నామజపంతోపాటు ధ్యానం, చివరకు పొందవలసిన సమాధి స్థితి.... ఇవన్నీ బహునేర్పుతో, బహుఓర్పుతో సాగించాలి, సాధించాలి. శంకర భగవత్పాదుల భజగోవిందమ్ అధునాతన మానవుడికి కరదీపిక, సత్యకాలిక, ఆనందమాలిక.
- వి.యస్.ఆర్.మూర్తి