15-04-2025 12:00:00 AM
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మండిపడ్డ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 14 (విజయక్రాంతి)ః ఊసరవెల్లి లా రంగులు మారుస్తున్న రాజగోపాల్ రెడ్డి...మంత్రి పదవి మీద ఉన్న యావ నియోజకవర్గ అభివృద్ధిపై లేదు... దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చెయ్ అంటూ మునుగోడు ఎమ్మెల్యే పై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న యావ ప్రజల సంక్షేమం పట్ల లేదని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చౌటుప్పల్ మండలం దామర గ్రామంలో సోమవారం నాడు టిఆర్‌ఎస్ పార్టీ రజితోత్సవ సన్నాక సమావేశంలో ఆయన మాట్లాడుతూ మునుగోడులో ఎక్కడ చూసినా తాను చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందని ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే చేసింది ఏమీ లేదని విమర్శించారు.
ఎంతసేపు మంత్రి పదవి మీద యావ తప్ప ఈ ప్రాంత ప్రజల సమస్యలపై పట్టింపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్న రాజగోపాల్ రెడ్డి పెద్ద బ్లాక్ మెయిల్ అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పిసిసి పదవి 40 కోట్లకు కొన్నారని, ఉత్తంకుమార్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన ఆయన ఇప్పుడు మంత్రి పదవి కోసం వారిని పొగుడుతున్నారని విమర్శించారు.
భువనగిరి ఎంపీ ని గెలిపించాలని చెప్తున్నా రాజగోపాల్ రెడ్డికి దమ్ముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ సపోర్టు లేకుండా తన మీద పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ పై ప్రజలకు నమ్మకం పోయిందని, ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అన్నారు. రాబోయే రోజుల్లో టిఆర్‌ఎస్ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈనెల 27న వరంగల్లో జరిగే రజితోత్సవ పార్టీ కార్యక్రమానికి ప్రజలు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లె రవికుమార్, అందోజు శంకర్ చారి, చింతల దామోదర్ రెడ్డి పెద్దింటి బుచ్చిరెడ్డి, దయాకర చారి, నరసింహ, గడ్డం మురళీధర్ రెడ్డి, ధనవంతు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.