calender_icon.png 26 April, 2025 | 1:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాళ్లకోసమే ఈ చెత్త పనులన్నీ

26-04-2025 01:07:40 AM

పాక్ వక్రబుద్ధి

  1. ఉగ్రవాదులను పెంచి పోషించడంపై పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్
  2. పహల్గాం ఉగ్రవాదులు స్వాతంత్య్ర సమరయోధులు: ఉప ప్రధాని ఇషాక్ దార్

ఇస్లామాబాద్, ఏప్రిల్ 25: జమ్మూ కశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతం పహల్గాం లో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరుల విషయంలో పాకిస్థాన్ తమ వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టింది. గత 30 ఏళ్లుగా అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసమే ఉగ్రవాదాన్ని పెంచి పోషించే చెత్త పనులన్నీ చేస్తున్నామని పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు.

మరోవైపు పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులను స్వాతంత్య్ర సమరయోధులతో పోల్చడం వివాదాస్పదమైంది. 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నవారిని స్వాతంత్య్ర సమరయోధులతో పోల్చడాన్ని చూస్తే పాక్ వక్రబుద్ధి మరోసారి బహిర్గతమైందంటూ భారత్ విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.

30 ఏండ్లుగా వారి కోసమే..

అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసమే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. 30 ఏండ్లుగా వారి కోసమే ఈ చెత్త పనులన్నీ చేస్తున్నామన్నారు. పహల్గాం దాడి తర్వాత భారత్‌లో నెలకొన్న ఉద్రిక్తతలపై ఖవాజా ఆసిఫ్ ‘స్కై న్యూస్’కు ఇంటర్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఖవాజా ఆసిఫ్‌ను ఉద్దేశించి ఉగ్ర సంస్థలకు నిధులు సమీకరించడం, ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం, మద్దతు తెలపడం వంటి వాటిపై స్పందన ఏంటని విలేకరి ప్రశ్నించారు. దీనిపై ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. ఒకప్పుడు ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన మాట నిజమేనన్నారు. కానీ దీని వల్ల పాక్ ఇబ్బందులు ఎదుర్కొందని వెల్లడించారు.

అది పెద్ద పొరపాటు చర్య అని తర్వాత అర్థమైందన్నారు. అయితే ఇప్పుడు మా దేశంలో ఆ ఊసే లేదని ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు సంబంధించిన ప్రశ్నకు బదులిస్తూ.. లష్కరే తోయిబా ఎప్పుడో అంతమైందని, అది ఇప్పుడు ఉనికిలో లేదన్నారు.

మా దేశంలో ఉగ్రవాద మూలాలు లేనప్పుడు పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని భారత్ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అయితే గతంలో లష్కరే తోయిబాకు పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్న మాట నిజమేనని ఖవాజా ఆసిఫ్ అంగీకరించడం గమనార్హం.  

ఆ ఒప్పందాన్ని ఆపలేరు..

పహల్గాం ఉగ్రదాడి ఘటనపై శుక్రవారం ఇస్లామాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి హాజరైన పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం జిల్లాలో దాడులు చేసిన వారు తమ దృష్టిలో స్వాతంత్య్ర సమరయోధులతో సమానమన్నారు.

ఇక పాకిస్థాన్‌లో 240 మిలియన్ల మందికి సింధూ నది నీరు చాలా అవసరమని పేర్కొన్నారు. ఆ ఒప్పందాన్ని భారత్ ఆపలేదని.. ఒకవేళ ఇండస్ ట్రీటీ రద్దు చేస్తే అది యుద్ధ చర్యకు దారి తీస్తుందన్నారు. పాకిస్థాన్‌ను బెదిరించినా లేదా దాడి చేసినా.. భారత్ కూడా అదే విధమైన ప్రతిచర్యను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.