తల్లి యోగక్షేమాలు చూడడం లేదంటూ... ఆస్తి కాజేసి ఆపై హత్య...
సిద్దిపేట (విజయక్రాంతి): తల్లి సంరక్షణను సాకుగా చూపి అన్నదమ్ముల ఆస్తి కాజేసి అడ్డొచ్చిన తమ్ముని హతమార్చిన కేసును సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు ఛేదించారు. నిందితులను సోమవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన సిద్దిపేట ఏసీబీ మధు వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామానికి చెందిన దొండకాయల కనకయ్య(50) ఇటీవల కొండపాక మండలం దుద్దెడ గ్రామ శివారుణ గల సేలంపు సమీపంలో రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. కనకయ్యకు ఒక అక్క, ఇద్దరు తమ్ముళ్ళు, తల్లి ఉన్నది. అయితే తల్లి యోగక్షేమాలు కొడుకులు పట్టించుకోవడం లేదంటూ అక్క యాదవ్వ తల్లి యోగక్షేమాలు చూస్తుంది. ఇదే క్రమంలో అన్నదమ్ముల ఆస్తిని 3.03 గుంటల భూమిని తన పేరుపై పట్టా చేసుకొని విక్రయించింది.
ఆ భూమి కొనుగోలుదారులు భూమి చుట్టూ హద్దులు ఏర్పాటు చేసుకునే క్రమంలో కనకయ్య ఇద్దరు తమ్ముళ్ళతో కలిసి అడ్డుకున్నారు. ఈ విషయమై మాట్లాడుకుని పరిష్కరించుకుందామంటూ కొండపాక మండలం మర్పడగ గ్రామానికి పిలిపించారు. చర్చలలో భాగంగా కనకయ్యకు అక్క యాదవ్వ కుటుంబ సభ్యులకు మాటా మాటా పెరిగింది. కనకయ్య తలపై కట్టెతో దాడి చేయగా స్రృహ కోల్పోయాడు. అక్కడే ఉన్న చెట్టుకు తాడుతో ఉరివేసి ఆత్మహత్యగా మార్చారు. అర్ధరాత్రి శవాన్ని కారులో తీసుకెళ్లి దుద్దెడ శివారు సేలంపు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు చిత్రీకరించేందుకు రోడ్డుపై పడవేశారు. గ్రామస్తులు రోడ్డుపై శవం ఉన్నట్లు పోలీసులకు సమాచారం ఇయ్యగా త్రీ టౌన్ పోలీసులు డెడ్ బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కనుకయ్య కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.