అమెరికాలో చివరి ఫలితం వచ్చేసింది
అరిజోనాలో రిపబ్లికన్లదే గెలుపు
ట్రంప్‌కు మొత్తం 312 ఎలక్టోరల్ ఓట్లు
నిక్కీ హేలీ, పాంపియోకు ట్రంప్ టీమ్‌లో దక్కని చోటు!
వాషింగ్టన్, నవంబర్ 10: అమెరికా అధ్య క్ష ఎన్నికల్లో చివరి ఫలితం కూడా వచ్చేసిం ది. స్వింగ్ స్టేట్లలో ఒకటైన అరిజోనాలో ఫలితాలు అధికారికంగా వెల్లడయ్యాయి. కాగా ఈ రాష్ట్రాన్ని కూడా రిపబ్లికన్ అభ్యర్థి డొనా ల్డ్ ట్రంప్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ విజయంతో స్వింగ్ స్టేట్స్ అన్నీ రిపబ్లికన్ పార్టీకే దక్కాయి. జార్జియా, పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సిన్, నెవడా, అరిజోనా, నార్త్ కరోలినా రాష్ట్రాల్లో ట్రంప్ పార్టీ జయభేరి మోగించింది. చివరిదైన అరిజోనాలోని 11 ఎలక్టోరల్ ఓట్లతో కలిపి ట్రంప్ మొత్తం 312 ఓట్లు సాధించారు.
కాగా, 2016లో ట్రంప్ 304 ఓట్లు సాధించారు. మొత్తం 7 స్వింగ్ స్టేట్లను ట్రంప్ కైవసం చేసుకుని ఈ ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లో 30 స్టేట్లలో రిపబ్లికన్లు గెలిచారు. డెమోక్రాట్లకు కంచుకోటగా ఉన్న రాష్ట్రాల్లోనూ ట్రంప్ హవా కొనసాగింది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహ్యారిస్‌కు 226 ఓట్లు మాత్రమే వచ్చాయి.
౧౩న ట్రంప్‌తో బైడెన్ భేటీ
అధికార మార్పిడిలో భాగంగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌తో ట్రంప్ భేటీ అవుతారని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. వచ్చే బుధవారం (నవంబర్ ౧౩) ఓవల్ ఆఫీస్‌లో ఇద్దరు నేతలు సమావేశం కానున్నారు. ఎన్నికల అనంతరం ఈ తరహా సమావేశం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ౨౦౨౦ ఎన్నికల తర్వాత బైడెన్‌తో ట్రంప్ ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయలేదు.
మైక్ పాంపియో... ?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ తన కార్యవర్గ బృందాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ క్రమంలో తన టీంలో నిక్కీ హేలీ, మైక్ పాంపియోకు స్థానం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఐరాస మాజీ రాయబారి నిక్కీ హేలీ, మాజీ విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియోను నూతన కార్యవర్గంలోకి ఆహ్వానించడం లేదన్నారు. వారు దేశానికి అందించిన సేవలు అద్భుతమని కొనియాడారు. ట్రంప్ ప్రకటనపై నిక్కీ హేలీ స్పం దిస్తూ..‘ఐరాసలో అమెరికాను సమర్థించే ట్రంప్‌తో కలిసి గతంలో పనిచేసినందుకు ఆనందంగా ఉంది.
ట్రంప్ అమెరికాను మరింత శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. నిక్కీ హేలీ భారత సంతతికి చెందిన మహిళ. ఆమె గతంలో కరోలినా గవర్నర్‌గా సేవలందించారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ అభ్యర్థిత్వాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించి ఆయనకు పోటీగా బరిలో దిగారు. కొద్దిరోజుల తర్వాత తిరిగి ట్రంప్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. మైక్ పాంపియో సైతం ట్రంప్‌కు సన్నిహితుడు. ఈయన్ను కూడా ట్రంప్ పక్కనపెట్టడం అగ్రరాజ్యంలో చర్చనీయాంశమైంది.