calender_icon.png 7 October, 2024 | 11:29 AM

శనిగరం లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం

04-09-2024 10:30:52 AM

ఉప్పొంగుతున్న వాగులు వంకలు

హుస్నాబాద్, (విజయక్రాంతి): వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని మధ్యతరహా శనిగరం ప్రాజెక్ట్ పొంగిపొర్లుతుంది. శనిగారం ప్రాజెక్టు కింద ఉన్న వాగులు, చెక్ డాములు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు శనిగరం ప్రాజెక్టు ఎగువన ఉన్న మోయ తుమ్మెద వాగు నుంచి భారీగా వరద పోటెత్తడం తో శనిగరం మధ్య తరహా ప్రాజెక్టుకు  భారీ స్థాయి లో వరద ప్రవాహం చేరుతుంది. శనిగరం, తంగళ్ళపల్లీ మధ్య వున్న పిల్లి వాగు బ్రిడ్జి పై నుండి ప్రవహిస్తుంది.

దీనితో రాకపోకలు నిలిచిపోయాయి. గుండారెడ్డి పల్లి కట్టు కాలువకు  వరద రావడం తో గుండ రెడ్డి పల్లి, బద్దిపడుగా మధ్యలో రాకపోకలు నిలిచి పోయాయి. కోహెడ మండల కేంద్రం లో బదుగుల చెరువు మత్తేడి పారుతుంది. దాంతో శనిగరం, గుండారెడ్డిపల్లి, తంగళ్ళపల్లి, కోహెడ గ్రామాల లోతట్టు ప్రాంతాలు పూర్తి జలమయం అయ్యాయి. ఇండ్లలోకి నీరు చేరి నిత్యవసర వస్తువులు దుస్తులు వరద నీటిలో కొట్టుకపోయాయి బాధితులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. పురాతన నివాసాలు కూలిపోవడంతో పాటు అక్కడ కొన్ని గుడిసెలు కొట్టుకుపోయాయి.