calender_icon.png 6 November, 2024 | 7:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెవెన్యూలో ఫోకల్ పోస్టులన్నీ.. అగ్రకులాలకేనా!

03-08-2024 03:31:38 AM

  1. రెడ్లు, కమ్మ, వెలమ, బ్రాహ్మణ, వైశ్యులకే హెచ్‌ఎండీఏ పరిధిలోని కీలక పోస్టులు 
  2. అర్హతలు, సీనియార్టీ, ప్రతిభ ఉన్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులను పక్కన పెడుతున్న వైనం 
  3. కొత్తగా ఐదుగురు రెడ్లకు రేవంత్ ప్రభుత్వం పోస్టులు 
  4. ఆందోళనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రెవెన్యూ అధికారులు 
  5. నేడో, రేపో జరగనున్న బదిలీల్లోనైనా అవకాశం దక్కేనా?

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 2 (విజయక్రాంతి): తెలంగాణ రెవెన్యూ శాఖలో కుల వివక్ష కొనసాగుతోంది. గత ప్రభుత్వంలో పదోన్నతులు, పోస్టింగ్‌లలో తీవ్రమైన నిరాదరణకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన రెవెన్యూ అధికారులు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోను రెట్టింపు నిరాదరణకు లోనైతు న్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీ వల చేసిన బదిలీల్లో కీలక పోస్టులన్నీ అగ్రకుల అధికారులకే కట్టబెట్టింది.

ఎస్సీ, ఎస్టీ, బీసీలలో అర్హతలు, సీనియార్టీ, ప్రతిభ ఉన్న అధికారులు ఉన్నా ప్రాధాన్యత లేని పోస్టులకే పరిమితం చేసిన ప్రభుత్వం.. ఫోకల్ పోస్టులలో మాత్రం రెడ్లు, కమ్మ, వెలమ, బ్రాహ్మణ, వైశ్యులనే కూర్చోబెట్టింది. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న ఎనిమిది జిల్లాల్లో అత్యంత కీలకమైన ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) పోస్టులలో 98శాతం అగ్రవర్ణ అధికారులకే పోస్టింగ్‌లు ఇవ్వడంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గ అధికారులు తీవ్రమైన ఆందోళనలకు లోనవుతున్నారు. 

ఫోకల్ పోస్టులన్నీ వారికే..

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల కొందరు ఆర్డీవో (రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్) లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో అత్యంత కీలకమైన హైదరాబాద్, కీసర, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చౌటుప్పల్ ఆర్డీవోలుగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన అధికారులను నియమించారు. వీరిలో హైదరాబాద్ ఆర్డీవోగా మహిపాల్ రెడ్డిని, కీసర ఆర్డీవోగా ఉపేందర్ రెడ్డిని, రాజేంద్రనగర్ ఆర్డీవోగా వెంకట్ రెడ్డిని, చేవేళ్ల సాయిరాం (ఖమ్మ), షాద్‌నగర్ ఆర్డీవోగా వెంకటమాధవ రావు (వెల్మ), శేరిలింగంపల్లి డీసీ (డిప్యూటీ కలెక్టర్)గా వెంకట్ రెడ్డిని, చౌటుప్పల్ ఆర్డీవోగా శేఖర్ రెడ్డిని నియమించారు.

అత్యంత కీలకమైన ఈ ఐదు పోకల్ పోస్టులు కూడా హెచ్‌ఎండీఏ పరిధిలోని జిల్లాల్లోనే ఉన్నాయి. అలాగే రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం ఆర్డీవోగా అనంత్ రెడ్డి, షాద్‌నగర్ ఆర్డీవోగా వెంకట్ మాధవ రెడ్డి, సంగారెడ్డి ఆర్డీవోగా వసంతకుమారి (వైశ్య)ని మెదక్ జిల్లా తూప్రాన్ ఆర్డీవోగా జయచంద్రారెడ్డిని నియమించారు. కేవలం మల్కాజగిరి ఆర్డీవోగా శ్యాం (బీసీ), కందుకూరు ఆర్డీవోగా సూరజ్ (బీసీ)ను నియమించారు. అయితే హెచ్‌ఎండీఏ పరిధిలో ఒక్క ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అధికారికి కూడా రెవెన్యూ శాఖలో కీలకమైన ఆర్డీవోగా నియమించలేదు. వాస్తవానికి మెరుగైన సీనియార్టీ, ప్రతిభ కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గ అధికారులు చాలామంది ఉన్నప్పటికీ వారికి అవకాశం ఇవ్వలేదనే ఆవేదనలో ఉన్నారు.

అడిషనల్ కలెక్టర్లు కూడా వాళ్లే...

అలాగే అగ్రకులాలకు చెందిన అధికారులనే హెచ్‌ఎండీఏ పరిధిలోని జిల్లాలకు ప్రభుత్వం అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)గా నియమించింది. ఇందులో మేడ్చల్ అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)గా విజయేందర్ రెడ్డిని, రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)గా భూపాల్ రెడ్డిని, సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ (రెవన్యూ)గా మాధురి (కమ్మ), సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)గా శ్రీనివాస్ రెడ్డిని, యాదాద్రి అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)గా బెన్ శాలెమ్(రెడ్డి)ని ప్రభుత్వం నియమించింది. రెవెన్యూ శాఖలో జరిగే బదిలీల్లో రెడ్లు, కమ్మ, వెలమ, బ్రాహ్మణ, వైశ్యులనే కీలక పోస్టుల్లో నియమించి తమను మాత్రం ఏమాత్రం ప్రాధాన్యత లేని పోస్టుల్లో కూర్చోబెడుతున్నారని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెవెన్యూ అధికారులు వాపోతున్నారు. 

ఈ సారైనా అవకాశం దక్కేనా...?

ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం రెవెన్యూ శాఖలో.. ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్ స్థాయి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులను బదిలీ చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. అయితే ఈ దఫా అయినా తమను ప్రభుత్వం కీలకమైన ఆర్డీవో, డీఆర్‌ఓ, అడిషనల్ కలెక్టర్ పోస్టుల్లో నియమిస్తుందో? లేదోనని ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఈ దఫా అయినా రెవెన్యూ శాఖ బదిలీల్లో సామాజిక న్యాయం పాటిస్తుందా లేదా అనేది ఒకటి రెండు రోజుల్లోనే తేలనుంది.