లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్‌మన్
న్యూ ఢిల్లీ, జూలై 26: కొవిడ్ అనంతరం కంపెనీల నిర్వహణలో అనూహ్య మార్పులు వచ్చాయి. ఉద్యోగులు ఇంటినుంచి పనిచేయడం దగ్గర నుంచి కీలక సమావేశాలు, రిక్రూట్‌మెంట్, ట్యూషన్లు ఇలా మెజార్టీ పనులు ఆన్‌లైన్ విధానంలో జరిగిపోవడం తదితర మార్పులను మనం చూశాం. దీనికి తోడు తాజాగా కృత్రిమ మేధ(ఏఐ) అందుబాటులోకి రావడంతో భవిష్యత్‌లో ఉద్యాగాలకు కోత పడనుందనే టాక్ సైతం నడుస్తోంది. ఈ తరుణంలో ప్రముఖ సామాజిక మాధ్యమం లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్‌మన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారితీశాయి.
కృత్రిమ మేధతో ప్రతీది అనుంసంధానం..
హాఫ్‌మన్ మాట్లాడుతూ.. 2034 నాటికి ఇప్పుడున్న సాంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగవుతాయని అన్నారు. దీనివల్ల కొత్తవారికి అవకాశాలతో పాటు సవాళ్లు ఎదురవుతాయన్నారు. స్థిరమైన ఉద్యోగాలు లేకపోవడం, నిపుణులు దీర్ఘకాలంలో ఒకేచోట పనిచేయడానికి ఇష్టపడకపోవడం వల్ల సమస్యలు తప్పవని తెలిపారు. దీని వల్ల ఒకే వ్యక్తి ఏకకాలంలో వివిధ కంపెనీలకు పనిచేయడం వంటిది ఉంటుంది. రాబోయే రోజుల్లో ఆతిథ్యరంగం సహా అన్ని సెక్టార్లకు కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్) అవసరం ఉంటుందన్నారు. కాగా గతంలోనూ హాఫ్‌మెన్ భవిష్యత్‌లో వచ్చే మార్పులపై చెప్పిన పలు అంశాలు నిజమయ్యాయి. సామాజిక మాధ్యమాలకు ఆదరణ పెరుగుతుందని, గిగ్ ఎకానమీ ఊపందుకుంటుందని, ఏఐ విప్లవం వస్తుందని హాఫ్‌మెన్ చాలాకాలం క్రితమే అంచనావేశారు.