calender_icon.png 21 January, 2025 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రాండ్ వెల్‌కమ్‌కు సర్వం సిద్ధం!

04-07-2024 12:42:11 AM

  • వాంఖడేలో ప్లేయర్లకు సన్మానం 
  • ఓపెన్ టాప్ బస్సులో ట్రోఫీ టూర్

ముంబై: రెండోసారి టీ20 ప్రపంచకప్ కైవసం చేసుకున్న టీమిండియా నేడు స్వదేశానికి రానుంది. వరల్డ్‌కప్ నెగ్గిన అనంతరం బార్బడోస్‌లో బెరిల్ హరికేన్ ప్రభావంతో నాలుగు రోజుల పాటు అక్కడే ఉండిపోయిన రోహిత్ సేన.. బుధవారం ప్రత్యేక చార్టెడ్ విమానంలో భారత్‌కు బయల్దేరింది. జట్టు ఆటగాళ్లతోపాటు సహాయక సిబ్బంది, బీసీసీఐ సెక్రటరీ జైషా, ఇతర అధికారులు, స్పోర్ట్స్ జర్నలిస్టులు కలిపి మొత్తం 70 మంది విమానమెక్కారు. గురువారం ఉదయం టీమిండియా బృందం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు ఘనస్వాగతం పలికేందుకు బీసీసీఐ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది.

దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఉదయం 11 గంటలకు భారత ఆటగాళ్లు ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అవనున్నారు. అనంతరం ప్రధాని మోదీతో కలిసి టీమిండియా బృందం అల్పాహారం చేయనుంది. తర్వాత రోహిత్ బృందం ప్రత్యేక విమానంలో ముంబైకి చేరుకోనుంది. ముంబై నుంచి సంబురాలు జరగనున్న వాంఖడే స్టేడియానికి టీమిండియా ఓపెన్ టాప్ బస్సులో చేరుకోనుంది. మార్గమధ్యంలో నారిమన్ పాయింట్ నుంచి రెండు కిలోమీటర్ల మేర జరగనున్న పరేడ్‌లో ఆటగాళ్లు ఓపెన్ టాప్ బస్సు నుంచి వరల్డ్‌కప్‌తో సందడి చేయనున్నారు.

అనంతరం వాంఖడే స్టేడియంలో నిర్వహించనున్న కార్యక్రమంలో బీసీసీఐ ఆటగాళ్లను ప్రత్యేకంగా సత్కరించనుంది. వరల్డ్‌కప్ గెలిచిన సందర్భంగా రూ. 125 కోట్ల నజరానాను టీమిండియా బృందానికి అందించనున్నారు. ‘టీమిండియా వరల్డ్‌కప్ గెలిచిన సందర్భంగా వాంఖడేలో నిర్వహించనున్న విక్టరీ పరేడ్‌కు అందరు తరలిరండి. ఘనంగా సంబురాలు చేసుకుందాం’ అని జైషా ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నాడు. భారత జట్టు తొలిసారి (2007) టీ20 ప్రపంచకప్ గెలిచిన సమయంలోనూ.. ధోనీ సేనకు ముంబైలో ఇదే విధం గా గ్రాండ్ వెల్‌కమ్ చెప్పిన విషయం తెలిసిందే.