11-02-2025 11:39:36 PM
సభలో బంధు సొసైటీ హైదరాబాద్ అధ్యక్షుడు పల్లెల వీరస్వామి...
ముషీరాబాద్ (విజయక్రాంతి): ముప్పై ఏండ్ల వర్గీకరణ చారిత్రకమైన వివాదాలకు తెరదింపిన సీఎం రేవంత్ రెడ్డికి యావత్తు షెడ్యూల్డ్ కులాలు రుణపడి ఉంటాయని బంధు సొసైటీ హైదరాబాద్ కమిటీ తెలిపింది. అదే రోజు సామాజిక న్యాయదినంగా ప్రకటించడాన్ని అభినందిస్తున్నారని కమిటీ పేర్కొంది. ఈ మేరకు మంగళవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలోని షోయబ్ హాల్‌లో బంధు సొసైటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, సబ్ కమిటీ సభ్యులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, దామోదరం రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ధనసరి అనసూయ (సీతక్క) దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మల్లు రవి, ఏకసభ్య కమిషన్ ద్వారా షెడ్యూల్డ్ కులాల ఆర్థిక, సాంఘీక స్థితిగతులను స్టడీ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి షమీమ్ అక్తర్‌లకు షెడ్యూల్డ్ కులాల తరపున సొసైటీ అధ్యక్షుడు పల్లెల వీరస్వామి, గౌరవాధ్యక్షుడు భరత్‌భూషణ్‌ల ఆధ్వర్యంలో కృతజ్ఞత సభను నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... భారత అత్యున్నత న్యాయస్థానం ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణపై వెలువరించిన తీర్పుకి అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణను అమలు చేయడంలో మొట్టమొదటి రాష్ట్రంగా ఉంటుందని ప్రకటించడం ఎంతో దైర్య సాహసాలతో కూడుకున్న రాజకీయ నిర్ణయమన్నారు. ఈ సమస్యను పరిష్కరించడంతో ఇప్పడు షెడ్యూల్డ్ కులాలు అందరు కలిసి హక్కుల సాధనకై కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైనదని అన్నారు. అదే కాకుండా అంతర్గతంగా ఉన్న చిన్న చిన్న విషయాలను కలిసికట్టుగా పరిష్కరించుకోవాలన్నారు. వర్గీకరణ గ్రూపులలో జరిగిన స్వల్ప తేడాలను జనాభా నిష్పత్తి ప్రకారం సరిచేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
గ్రూపు ఉద్యోగాలలో ప్రకటించిన వర్గీకరణ పద్దతిలో ఖాళీలను భర్తీ చేయాలని అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్య, వైద్య రంగంపై కనీసం 20 శాతం నిధులు తగ్గకుండా కేటాయించాలన్నారు. గత ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల దగ్గర అభివృద్ది పేరిట స్వాధీనం చేసుకున్న భూములను తిరిగి వారికి అందజేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో బంధు సొసైటీ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి ఇ. దేవదానం, కోశాధికారి కే. వెంకటేశ్వర్ రావు, ఉపాధ్యక్షుడు వి. అంకుషయ్య, జాయింట్ సెక్రెటరీ హంసరాజు, గొల్లపల్లి దయానందరావు, కోళా జనార్ధన్ బంధు సొసైటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.