calender_icon.png 30 September, 2024 | 2:56 AM

డీఈవో, డిప్యూటీఈఓ పోస్టులన్నీ ఖాళీ!

30-09-2024 12:22:53 AM

  1. ఇప్పటికే విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపిన అధికారులు
  2. ఏడు నెలలుగా సాంక్షన్డ్ పోస్టలపై నిర్ణయం తీసుకోని విద్యాశాఖ
  3. పర్యవేక్షణ అధికారులు లేక గాడి తప్పుతున్న ప్రభుత్వ విద్య

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): విద్యాశాఖలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. జిల్లా స్థాయుల్లో పర్యవేక్షణ అధికారులు లేక విద్యావ్యవస్థ గాడితప్పుతోంది. ఏండ్లుగా పర్యవేక్షణాధికారి పోస్టులను భర్తీ చేసిన దాఖలాల్లేవు. పాఠశాల విద్యాశాఖలో గ్రామ, మండల, జిల్లాస్థాయిలో అంతా ఇన్‌చార్జుల పాలనే నడుస్తోంది.

సరిపడా డీఈవోలు...డిప్యూటీ ఈవోలు లేరు. ఎంఈవోలు కూడా ఇన్‌చార్జులే ఉన్నారు. ఈక్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి 12న అప్పటి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన పర్యవేక్షణాధికారుల ఖాళీలకు సంబంధించిన ప్రతిపాదనలను విద్యాశాఖ ముఖ్యకార్య దర్శికి పంపించారు.

ఈ ప్రతిపాదనల్లో 21 డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ (డీఈవో) పోస్టులు, 28 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ పోస్టులు, 59 మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ పోస్టులతోపాటు మరో 5 అసిస్టెంట్ డైరెక్టర్స్ సాంక్షన్డ్ పోస్టుల భర్తీకు ప్రతిపాదనలు పంపారు. ఏడు నెలలు గడుస్తున్నా దీనిపై ప్రభుత్వం ఈ ప్రతిపాదనలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

12 జిల్లాలకే డీఈవోలు..

రాష్ట్రంలో 33 జిల్లాలకుగానూ కేవలం 12 జిల్లాలకే డీఈవోలు ఉన్నారు. మిగిలిన 21 జిల్లాల్లో డీఈవో పోస్టులు మంజూరు చేసినా భర్తీ చేయలేదు. రాష్ట్రంలో 632 మండలాలున్నాయి. అయితే మొన్నటి వరకు 16 మంది మాత్రమే రెగ్యులర్ ఎంఈవోలు పనిచేశారు. మిగిలిన మండలాల్లో  ఇన్‌చార్జులతో కొనసాగించారు. ఆరు నుంచి పది మండలాలకు ఒకరు ఇన్‌చార్జీగా ఉండేవారు.

సెప్టెంబర్ 24న 609 మందికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. మరో ఏడు మండలాలకు నియమించాల్సి ఉంది. డిప్యూటీ ఈవోలు ప్రస్తుతం 56 మంది పనిచేస్తున్నారని, మరో 28 మంది కావాలని, అసిస్టెంట్ డైరెక్టర్లుగా 29 పనిచేస్తుండగా, మరో ఐదు పోస్టుల భర్తీకి విద్యాశాఖకు అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఈ పోస్టుల మంజూరు చేసి, భర్తీకి చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ విద్య వ్యవస్థ బలోపేతమవుతుందని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.

గాడి తప్పుతున్న సర్కారు విద్య..

డీఈవో, డిప్యూటీఈవో, ఎంఈవో పర్యవేక్షణ అధికారుల పోస్టులు ఖాళీగా ఉండడం తో జిల్లాస్థాయి, గ్రామీణ ప్రాంతాల్లో విద్యావ్యవస్థ కుంటుపడుతోంది. ఈ ఖాళీలను భర్తీ చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడి కొంత మంది అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలపై సైతం పర్యవేక్షణ కరవైంది.