06-03-2025 10:27:44 PM
బిజెపి నేత అరిగెల నాగేశ్వరరావు..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హయంలో అభివృద్ధి కుంటుపడిందని ఇప్పుడు ప్రజలందరూ బిజెపి వైపు చూస్తున్నారని బిజెపి సీనియర్ నాయకులు, మాజీ జెడ్పిటిసి సభ్యుడు అరిగేలా నాగేశ్వరరావు పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి బలపరిచిన అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించడంతో ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా బిజెపికి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని, వచ్చే స్థానిక ఎన్నికల్లో సైతం బిజెపి పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
గ్రామాల అభివృద్ధి ఒక్క బిజెపితోనే సాధ్యమని, ఈ పార్టీ అందరికీ రక్షణ కవచంలా ఉంటుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేదని, కాంగ్రెస్ పార్టీ వస్తే మార్పు వస్తుందని ఆశించిన ప్రజలు మోసపోయారని, ఎన్నికల హామీలను నెరవేర్చక పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థి విజయం సాధించిన నేపథ్యంలో తన నివాసం, అంబేద్కర్ చౌక్ లో బాణసంచ పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు ఖాండ్రే విశాల్, మాజీ ఎంపీపీ మల్లికార్జున్, బిజెపి మండల అధ్యక్షుడు పెంటయ్య, నాయకులు ప్రసాద్ గౌడ్, మధుకర్, జయరాజ్, వెంకన్న, కార్యకర్తలు పాల్గొన్నారు.