calender_icon.png 6 October, 2024 | 5:56 AM

మూసీపై అఖిలపక్ష కమిటీ

06-10-2024 02:33:51 AM

నిర్వాసితులకు సౌకర్యాలపై పార్టీలతో చర్చిస్తం 

రూ.10 వేల కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధం 

మలక్‌పేట రేస్ కోర్స్, అంబర్‌పేట పోలీస్ అకాడమీ తరలిస్తం 

ఆ ప్రాంతాల్లో నిర్వాసితులకు ఇండ్లు కట్టిస్తం

గడ్డం వెంకటస్వామి జయంతి సభలో సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 5 (విజయక్రాంతి): మూసీ నది అభివృద్ధి కోసం చేపట్టిన ప్రాజెక్టు వల్ల నష్టపోతున్న నిర్వాసితులకు ఎలా న్యాయం చేయాలన్న అంశంపై చర్చించేందుకు రాష్ట్రం లోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో కలిసి అఖిలపక్ష కమిటీ వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

నిర్వాసి తుల కోసం అవసరమైతే రూ.౧౦ వేల కోట్లు ఖర్చు చేయటానికి కూడా ప్రభు త్వం సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. మూసీ నిర్వాసితులకు మెరుగైన ప్రత్యామ్నాయం చూపెడ తామని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ ఇతర అన్ని రాజకీయ పార్టీలతో ప్రత్యేక కమిటీ వేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సీఎం సూచించారు.

కాంగ్రెస్ దివంగత నేత వెంకటస్వామి (కాకా) 95వ జయంతి సభ శనివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంతకుముందు ట్యాంక్ బండ్‌పై ఉన్న కాకా విగ్రహానికి పలువురు మంత్రులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథులుగా హజరై కాకా చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మూసీ నిర్వాసితులను ప్రభుత్వం అనాథలను చేయబోదని భరోసా ఇచ్చారు.

అవసరమైతే మలక్‌పేట రేస్ కోర్స్‌ను, అంబర్‌పేట పోలీస్ అకాడమీని వేరే చోటికి తరలించి, అక్కడ పేదలకు ఇండ్లు కట్టిస్తామని తెలిపారు. మూసీ ముసుగును రక్షణ కవచంలా అడ్డం పెట్టుకుంటూ బీఆర్‌ఎస్ నేతలు వాళ్ల ఫాం హౌజ్ లను కాపాడుకోవడానికి ప్రజలను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. నిర్వాసితులను ఆదుకోవడానికి ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం ఉందని తెలిపారు.

నిర్వాసితులను ఆదుకొనేందుకు సూచనలు ఇవ్వాలని బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీష్‌రావుతోపాటు బీజేపీ నేత ఈటల రాజేందర్‌ను కోరారు. మూసీ ఆక్రమణలను తొలగించాలని 2019లోనే బీఆర్‌ఎస్ ప్రభుత్వం జీవో జారీ చేసిందని సీఎం తెలిపారు.

ప్రాణహిత చేవెళ్లకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెడితే.. ఆ పేరును తొలగించేందుకు డిజైన్ మార్చి రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టారని విమర్శించారు. కాళేశ్వరం కట్టుడు కూలుడు మీ హాయంలోనే జరిగాయని బీఆర్‌ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. 

చర్లపల్లి జైలుకు వెళ్లడం ఖాయం 

తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లంతా చచ్చిపోతుంటే.. బీఆర్‌ఎస్ నేతలు మాత్రం గుట్టలు గుట్టలుగా ఆస్తులు పోగేశారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ‘మీరు దోచిన సొమ్ములో ౧౦ శాతం ఇచ్చి మూసీలో కలుషిత వాతావరణంలో జీవిస్తున్న పేదలను బాగు చేయొచ్చు కదా? గజ్వేల్‌లో వెయ్యి ఎకరాలు, జన్వాడలో 50 ఎకరాల ఫాం హౌజ్‌లలో సగం పేదలకు దానం చేయొచ్చు కదా? 2004లో మీరు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లలో ఎన్ని ఆస్తులు ఉన్నాయో..

ఇప్పుడెన్ని ఉన్నాయో తెలీదా? ఇవన్నీ దోచుకుంటే వచ్చినవి కాదా? మీ ఆస్తులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు.. మీ పదేళ్ల పాలనా అనుభవంతో ఏం చేద్దామో మంచి సలహాలు చెప్పండి. ప్రభుత్వం ఏం చేసినా కాలకేయ ముఠాలా అడ్డు పడటం సరికాదు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రూ.11 వేల కోట్ల రుణమాఫీ చేస్తే.. మేం నెల రోజుల్లో రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశాం.

సోషల్ మీడియాతో అధికారంలోకి రావొచ్చని కొందరు కలలు కంటున్నారు. కానీ, వాళ్లు చర్లపల్లి జైలుకు వెళ్లడం మాత్రం ఖాయం. నరేంద్రమోదీ సబర్మతీ నదిని అభివృద్ధి చేస్తే చప్పట్లు కొట్టి గొప్పలు చెబుతున్న బీజేపీ నేతలకు మూసీని అభివృద్ధి చేస్తే వచ్చిన ఇబ్బంది ఏంటి?’ అని సీఎం ప్రశ్నించారు. 

కాకా పేదల ఆస్తి 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మరుగున పడకూడదంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని ఒప్పించిన ఘనత కాకాకే దక్కుతుందని సీఎం అన్నారు. తెలంగాణ విషయంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లు ఆనాడు ఎన్నికల్లో గెలిచేందుకు కాకా సహకారం తీసుకొని అధికారంలోకి వచ్చాక ఆయన జయంతిని అధికారికంగా జరపకుండా విస్మరించారని విమర్శించారు.

కాకా పేద ప్రజల ఆస్తి అని, పేదల మనిషి అని కొనియాడారు. నగరంలో 80 వేల మంది నిరుపేదలకు ఇండ్లు ఇప్పించిన ఘనత కాకాది అని తెలిపారు. తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి ఎదిగి నేతల్లో ఒకరు పీవీ నరసింహారావు అయితే.. మరొకరు కాకా అని చెప్పారు.  

ప్రభుత్వాలపై ప్రభావం చూపిన గొప్ప వ్యక్తి కాకా: భట్టి 

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రభుత్వాలపై ప్రభావం చూపిన గొప్ప వ్యక్తి గడ్డం వెంకటస్వామి అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొనియాడారు. హైదరాబాద్‌లో ఎవరికైనా ఇబ్బంది ఉంటే చెప్పుకోవడానికి కాకా పెద్ద దిక్కుగా ఉండేవారని తెలిపారు.

హైదరాబాద్ నగరానికి బతకడానికి వచ్చిన వారందరికీ గుడిసెలు వేయించి గడ్డం వెంకటస్వామి గుడిసెల వెంకటస్వామిగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారని అన్నారు. బలమైన లక్ష్యాలు ఉంటే పేదరికం, కులం అడ్డంకులు కావని కాకా నిరూపించారని కొనియాడారు.

పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ పేదల జీవితాల్లో వెలుగు నింపిన వ్యక్తి కాకా అని అన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్, ప్రేమ్ సాగర్ రావు, నాగరాజు, సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.