12-02-2025 10:26:38 PM
సినిమా ప్రతినిధి (విజయక్రాంతి): ఇటీవలి కాలంలో ఎందుకో చిరంజీవి కాస్తంత నోరు జారుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇటీవల ఓ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో రాజకీయాల గురించి మాట్లాడి ట్రోల్ అయ్యారు. తిరిగి తాజాగా ఓ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘బ్రహ్మా ఆనందం’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడుతూ.. తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే వారసుడు కావాలని తనకు బాగా ఉండేదన్నారు.
“మా ఇంటి నిండా అమ్మాయిలే ఉండటంతో లేడీస్ హాస్టల్‌లో వార్డెన్‌లా నా పరిస్థితి ఉంటుంది. చుట్టూ అమ్మాయిలే ఉంటారు. ఒక్క మగ పిల్లాడు కూడా లేడు. అందుకే ఈసారైనా మగపిల్లాడిని కనురా చరణ్. మన లెగసీని ముందుకు తీసుకెళ్లాలని అంటుంటా. నా మనవరాలు క్లీంకార అంటే చరణ్‌కి ముద్దు. మళ్లీ ఇంకో అమ్మాయిని కంటాడేమోనని భయంగా ఉంది” అని చిరు అన్నారు. ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి అంతటి వారు అలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆయన మాట్లాడిన మాటల తాలుకు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. 2025లో కూడా అమ్మాయిల పట్ల ఈ వివక్షేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.