వనపర్తి (విజయక్రాంతి): మాతా శిశు మరణాలు తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మాతా శిశు మరణాలు, సంరక్షణ చర్యల జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జనవరి నుండి సెప్టెంబర్ వరకు జిల్లాలో జరిగిన మాతృ మరణాలు, శిశు మరణాలు అందుకు గల కారణాలపై సమీక్ష నిర్వహించారు. జనవరి నుండి సెప్టెంబర్ వరకు 4 మాతృ మరణాలు జరుగగా ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు 56 శిశు మరణాలు జరిగినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. మాతృ మరణాల పై కలక్టర్ ఒక్కో కేసు వారీగా కారణాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హై రిస్క్ ఉన్న గర్భిణీల ఆరోగ్యంపై మెడికల్ ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, తప్పనిసరిగా పూర్వ ఆరోగ్య పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకోవాలని అవే విషయాలు ఏ.ఎన్.సి చెకప్ లో నమోదు చేయాలని సూచించారు. అదేవిధంగా హై రిస్క్ ఉన్న గర్భిణీలకు ఈ.సి.జి సైతం చేయాలని సూచించారు. జిల్లాలో ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు 56 శిశు మరణాలు జరగటంపై కేసు వారీగా కారణాలు రాత పూర్వకంగా ఇవ్వాలని ప్రోగ్రాం ఆఫీసర్ ను ఆదేశించారు. వీపనగండ్ల, మరికొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఎక్కువ శాతం సి.సెక్షన్ ద్వారా ప్రసవాలు ఎందుకు జరుగుచున్నయని ప్రశ్నించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్స్ నియామకం జరిగినందున అదే విధంగా లేబర్ వార్డులో ఎయిర్ కండిషన్ తో పాటు మౌలిక సదుపాయాలు కల్పించినందున ఇక నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరగాలని ఆదేశించారు.
ప్రతి గర్భిణీ యొక్క త్రైమాసిక ఏ.ఎన్.సి నమోదు సకాలంలో ఖచ్చితంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంగన్వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లతో సమావేశాలు నిర్వహించి మొదటి ఏ.ఎన్.సిలు తప్పని సరిగా నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. జయచంద్ర మోహన్, గైనకాలజిస్ట్ డా. కిరణ్మయి, స్వచ్ఛంద సంస్థ నుండి చిన్నమ్మ థామస్, డా. సాయినాథ్ రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.