calender_icon.png 13 November, 2024 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నీ అబద్ధాలే

10-11-2024 12:55:22 AM

ప్రధాని మోదీ అబద్ధాలు ఆపకపోతే.. మేము నిజాలూ ఆపం

  1. బీజేపీ అంటేనే భారతీయ ఝూటా పార్టీ’ 
  2. తెలంగాణలో పది నెలల్లో చాలా చేశాం 
  3. బీఆర్‌ఎస్, బీజేపీ తెలంగాణకు ద్రోహం చేశాయి 
  4. పోరుగడ్డ మరాఠా.. గుజరాతీలకు గులాం కావొద్దు
  5. ముంబై ప్రెస్‌మీట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పడం మానకపోతే.. తాము నిజాలు చెప్పడం ఆపబోమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. బీజేపీ అంటే భారతీయ ఝూటా పార్టీ అని అభివర్ణించారు.

మహారాష్ర్ట బీజేపీ నేతలు సైతం కొద్దిరోజులుగా తెలంగాణలో తమ సర్కారు అమలు చేస్తున్న పథకాలపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ కూడా వారి బాటలోనే నడుస్తున్నారని మండిపడ్డారు. దుష్ప్రచారాన్ని పటాపంచలు చేయడానికే తాను ముంబైకి వచ్చినట్టు రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

శనివారం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ముంబైకి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రజలకు ఎంతో చేసిందని పునరుద్ఘాటించారు. గతంలో కేంద్రంలోని మోదీ సర్కారు, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణకు తీరని ద్రోహం చేశాయని ధ్వజ మెత్తారు.

తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న ఆరు గ్యారెంటీల అమలుపై ప్రధాని మోదీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల కల అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా ఇచ్చారని, ఆమె ప్రకటించిన అన్ని హామీలను రాష్ట్రంలో అమలు చేస్తున్నట్టు వెల్లడించారు.

దేశంలోనే అత్యధికంగా మహారాష్ర్టలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని, వారి సంక్షేమాన్ని ఆ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మరిచాయని విమర్శించారు. రైతు నల్ల చట్టాలు తెచ్చి మోదీ.. అదానీ, అంబానీలకు మేలు చేయాలని భావించారని ఆరోపించారు. కానీ, తాము తెలంగాణ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి అమలు చేశామని స్పష్టంచేశారు.

అధికారంలోకి వచ్చిన 25 రోజుల్లోనే 22,22,067 మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని వివరించారు. వివరాలు కావాలంటే.. తెలంగాణకు వస్తే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణ రైతుల విషయంలో మోదీ గతంలో చేసిన విమర్శలకు సరైన సమాధానం ఇచ్చామని గుర్తు చేశారు. ఆ తర్వాత ఆయన తమకు వ్యతిరేకంగా చేసిన ట్వీట్‌ను డిలీట్ చేసుకున్నారన్నారు. 

బీజేపీ, బీఆర్‌ఎస్ దోస్త్తీ 

తెలంగాణలో బీఆర్‌ఎస్, బీజేపీలు దోస్తులుగా ఉన్నారని, ఈ రెండు పార్టీల వల్ల తెలంగాణకు తీరని ద్రోహం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని స్పష్టంచేశారు. తెలంగాణకు వస్తే ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లకు ఈ వివరాలను కూడా ఇస్తానని చెప్పారు.

మహాలక్ష్మీ పథకం కింద రూ.500 కే గ్యాస్ అందిస్తున్నామని, దీని ద్వారా 49 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా లబ్ధి పొందుతున్నారని గుర్తుచేశారు. రైతులకు ఒకవైపు ఎంఎస్పీ ఇవ్వడంతోపాటు అదనంగా వరికి రూ.500 మద్దతు ధర అందిస్తున్నామని చెప్పారు.

తెలంగాణలో ఇప్పటి వరకు 1.4 కోట్ల మంది మహిళలు ౧౦ నెలల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకున్నారని వెల్లడించారు. ఇందుకోసం రూ.3,541 కోట్లను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. ఇలా అన్ని పథకాలను తమ ప్రభుత్వం అందిస్తోందన్నారు. 

ఎవరి చేతుల్లోకో వెళ్లకూడదు

దేశ చరిత్రలో మహారాష్ర్టకు ప్రత్యే క స్థానం ఉన్నదని రేవంత్‌రెడ్డి అన్నా రు. జ్యోతిబాపూలే, బాలగాంగధర్ తిలక్, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి దేశ గతిని మార్చిన ఎందరో మహానుభావులకు ఈ గడ్డ జన్మనిచ్చిందని గుర్తు చేశారు. ఇంతటి చైతన్యం ఉన్న గడ్డపైనే ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ కూడా ఉన్నారని అన్నారు.

ఇలాంటి పోరు గడ్డ గుజరాత్ వాళ్లకు గులాం కావొద్దని హితవు పలికారు. ఎంతో ఘనత ఉన్న మహారాష్ర్ట ఎవరి చేతుల్లోకో వెళ్లకూడదని అన్నారు. దేశంలో రాజ కీయంగా ప్రభావవంతమైన రాష్ట్రాల్లో యూపీ తర్వాత మహారాష్ట్ర మాత్రమే అన్నారు.

మహారాష్ర్టకు రావాల్సిన 17 ప్రాజెక్టులను మోదీ గుజరాత్‌కు తరలించుకొని పోయారని విమర్శించారు. మహారాష్ట్ర ప్రాజెక్టులను తరలించుకొని వెళ్లి.. అబద్ధాల మీద అబద్ధాలు చెప్తోన్న బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు.

సామాజిక న్యాయం కోసం కులగణన 

తెలంగాణలో సామాజిక న్యాయం అందించేందుకు కులగణన చేపట్టామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. ఇది స మాజానికి ఎక్స్‌రేలాంటిదని తమ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు. అంతేకాకుండా మెగా ఫ్యామిలీ హెల్త్ చెకప్‌ను కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఒక నెలలో ౪ కోట్ల మందిని సర్వే చేయబోతున్నామని వివరించారు. 2025 జనగణనలో తెలంగాణ కులగణనను పరిగణనలోకి తీసుకోవాలని క్యాబినెట్‌లో తీర్మానం చేయబోతున్నామని వెల్లడించారు. ఈ మేరకు మోదీని డిమాండ్ చేయబోతున్నామని చెప్పారు.