16-04-2025 01:05:00 AM
భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 15 (విజయక్రాంతి) అడ్వకేట్స్ యాక్ట్ కు సవరణ చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతిపాదిత బిల్లును వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఐలు నాయకులు జె శివరాం ప్రసాద్, రమేష్ కుమార్ మక్కాడ్ తెలిపారు. ప్రతిపాదిత సవరణలతో బార్ కౌన్సిల్ స్వతంత్ర ప్రతిపత్తి ప్రశ్నార్ధకం మారుతుందన్నారు.
న్యాయవాద వృత్తి మనుగడకు ప్రమాదకరంగా పరుణమిస్తుందని, ప్రస్తుత చట్టాన్నే కొనసాగించాలని, విదేశీ లాయర్లను అనుమతించొద్దని ఏ.ఐ.ఎల్.యు. నాయకులు డిమాండ్ చేశారు. ప్రచారం లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ముసాయిదా బిల్లు ప్రతిపాదనలపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలతో కూడిన ఎనిమిది పేజీల వివరణాత్మక కరపత్రాన్ని ఏ.ఐ.ఎల్.యు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించి విడుదల చేసారు. జిల్లా వ్యాపితంగా న్యాయవాదులకు మంగళవారం కరపత్రాన్ని పంపిణీ చేశారు.
కరపత్రంలో కొత్త ముసాయిదా బిల్లులోని లోపాలు, కేంద్ర ప్రభుత్వ ఏకపక్షవైఖరిని వివరించారు. ముసాయిదా బిల్లులో న్యాయవాదుల రక్షణ, సంక్షేమ చర్యలపై ఏమీ లేకపోగా, వృత్తిని ప్రమాదంలో పడేసే ప్రతిపాదనలు ఉన్నాయని తప్పుబట్టారు.ఎలాంటి చర్చలు, సంప్రదింపులు లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారం సవరించాలని చూస్తే, దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కొత్త బిల్లుపై ఇప్పటికే ఐలు పరిశీలనలు, ప్రతిపాదనలతో కూడిన వినతిపత్రాన్ని కేంద్రప్రభుత్వానికి పంపినట్టు తెలిపారు.
కేవలం న్యాయవిద్య చదువుకున్న వారు మాత్రమే న్యాయవాద వృత్తిలోకి అనుమతించాలని, న్యాయవాదులు మాత్రమే బార్ కౌన్సిళ్లకు ప్రాతినిధ్యం వహించాలని ఏ.ఐ.ఎల్.యు. నాయకులు అభిప్రాయపడ్డారు. ఆయా రాష్ట్రాల బార్ కౌన్సిళ్లలోగానీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలోకి గాని కేంద్ర ప్రభుత్వం ముగ్గురు న్యాయవాదేతర వ్యక్తులను నియమించాలని చూడటం అప్రజాస్వామ్య విధానమని విమర్శించారు. కొత్త సవరణ చట్టం న్యాయవాదుల ఉనికిని దెబ్బతీసేవిధంగా ఉందని గుర్తు చేశారు.
కొత్త ప్రతిపాదిత ముసాయిదాలో తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ పేరే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బార్ కౌన్సిళ్ల ఎన్నికలు ప్రజాస్వామ్య పద్దతిలో జరుగుతున్నాయని గుర్తు చేశారు. కరపత్రాన్ని ఐలు నాయకులు ఎం.వి. ప్రసాదరావు, రమేష్ కుమార్ మక్కడ్, జె. శివరాం ప్రసాద్, కె.పుల్లయ్య, పి.కిషన్ రావు, పాయం రవివర్మ, బండారు అరుణ్, రావిలాల రామారావు, అరికాల రవి కుమార్, మెదరమెట్ల శ్రీనివాస రావు, యు.గౌతమ్ కుమార్ తదితరులు ఆవిష్కరించారు.