calender_icon.png 22 December, 2024 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నీ ఒక చోటే చౌకగా.. హైదరాబాద్ అంగళ్లు

27-10-2024 12:00:00 AM

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం మినీ భారతం నుండి విశ్వనగరంగా మారిం ది. ప్రపంచంలోని అన్ని వస్తువులు,బట్టలు, గృహోపకరణాలు ఐకియా, డెకథ్లాన్,డీ మార్ట్, రత్నదీప్ ఇంకా పెద్ద పెద్ద షాపింగ్ మాల్‌లు నగరంలో ఉన్నాయి.

అయినప్పటికీ నిజాం కాలం నాటి నుండి ఎర్రగడ్డ అంగడి , గురువారం జరిగే జుమ్మేరాత్ బజార్‌లలో అగ్గిపెట్టె నుండి అలంకరణ వస్తువులు , కాళ్ల పట్టీల నుండి కంప్యూటర్ విడిభాగాలు, ఇంట్లో వాడుకునే వస్తువులు, పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరలో బట్టలు, గృహోపకరణాలు ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు దొరుకుతున్నాయి.

ప్రపంచం కుగ్రామంగా మారి శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించినా, ఆన్‌లైన్ మార్కెట్ అందుబాటులో ఉన్నా గత కొంత కాలంగా ఆదివారం వచ్చిందంటే అంగళ్ల సందడి ఊపందుకుంటుంది. తెలంగాణలోని 33 జిల్లాల నుండి, వివిధ మండలాలు, గ్రామాల నుండి ప్రజలు శుభ, అశుభ కార్యాలకు ఏమి కొనాలన్నా హైదరాబాద్ కు వస్తుంటారు.హైదరాబాద్ బట్టలకు, బంగారు, వెండి నగలకు,గాజులకు,అత్తర్, వస్త్రాలకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ప్రసిద్ధి పొందింది.

అంగడిని సంత, మార్కెట్, బజారు అనే పేర్లతో పిలుస్తారు.హైదరాబాద్ అనేక మార్కెట్లకు ప్రసిద్ది చెందింది. మోండా మార్కెట్, బేగంబజార్, చార్మినార్ చుడీ మార్కెట్, మీరాలం మండీ, గుడిమల్కాపురం, గౌలిపుర, జియాగూడ, కాచిగూడ, సికింద్రాబాద్, దిల్‌సుఖ్ నగర్, ఆమీర్ పేట్, బాలానగర్, బోయిన్ పల్లి, రైతు బజార్లు.. ఈ విధంగా అనేక ప్రాంతాలలో ప్రజలకు కావల్సిన అన్ని సరుకులు అందుబాటు ధరల్లో దొరకడం హైదరాబాద్ ప్రత్యేకత.

ప్రతి రోజూ సంతల పేరిట హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాలలో ముఖ్యం గా మురికివాడలలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, బట్టలు అమ్ముతున్నారు. గ్రామీణ వాతావరణం హైదరాబాద్ లోని అంగళ్లలో మనకు ఇంకా స్పష్టంగా కన్పిస్తుంది. ఎంతో అభివృద్ధి సాధించిన మన దేశంలో ఉన్న సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, అలంకరణలు దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ అంగళ్లలో కన్పించడం విశేషం.

 డా. ఎస్.విజయ భాస్కర్