calender_icon.png 26 October, 2024 | 12:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశలన్నీ క్యాబినెట్ పైనే..!

18-09-2024 12:14:33 AM

ఈనెల 20న జరిగే క్యాబినేట్ మీటింగ్‌పైనే ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్ల ఆశలు

దసరా ముందు డీఏలు, పీఆర్సీ, పెండింగ్ సమస్యలపై తీపి కబురు చెప్తారని ఎదురుచూపు

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): ఈనెల 20న జరిగే క్యాబినెట్ సమావేశంపై రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆశలు పెట్టుకున్నారు. దసరా పండుగకు ముందు మంత్రివర్గం సమావేశం కానుండడంతో తమకు ప్రభుత్వం ఏమైనా తీపి కబురు అందిస్తుందని వారంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎంతోకాలంగా డీఏ (కరువు భత్యం), పీఆర్సీ (పే రివిజన్ కమిషన్), ఇతర సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి.

మొత్తం ఐదు డీఏలు, రెండో పీఆర్సీ నివేదికతోపాటు ప్రత్యేక ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. ఆగస్టు 15 తర్వాత ఉద్యోగులకు డీఏలు ప్రకటిస్తారని అంతా భావించారు. ప్రభుత్వం కూడా రైతు రుణమాఫీ పూర్తున వెంటనే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన డీఏలను ప్రకటిస్తామని ప్రకటించింది. కానీ రైతు రుణమాఫీ తర్వాత ప్రభుత్వం ఎలాంటి ప్రకటన లేదు. దీంతో ఈనెల 20న జరిగే క్యాబినెట్ సమావేశంలోనా తమ డిమాండ్లను నెరవేరుస్తారేమోనని భావిస్తున్నారు. 

ఐదు డీఏల్లో ఇచ్చేది ఎన్నో?

రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వం మొత్తం 5 డీఏలు బకాయి ఉంది. చివరగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2022, జనవరిలో డీఏను ప్రకటించింది. ఆ తర్వాత 2022, జూలైలో ఒకటి, 2023, జనవరిలో రెండు, 2023, జూలై మూడు, 2024, జనవరిలో నాలుగు, 2024, జూలైలో ఐదో డీఏ ప్రకటించాల్సి ఉంది. వీటిలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నాలుగు డీఏలను ప్రకటించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచింది. 2024, జూలై డీఏను కేంద్ర ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది.

అది కూడా కలుపుకుంటే రాష్ట్ర ఉద్యోగులకూ రేవంత్ సర్కార్ ఐదు డీఏలను మంజూరు చేయాల్సి ఉంటుంది. వీటిలో ఎన్ని డీఏలను ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తోందోనని ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు డీఏల ప్రతిపాదనలు, అవసరమైన నిధుల అంచనాలను సైతం సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చినట్లు తెలిసింది.

వీలుంటే ఈ క్యాబినెట్ సమావేశంలో డీఏ, పీఆర్సీపై నిర్ణయం తీసుకోవాలని, లేదంటే దసరా కానుకగా పండగకు ముందు ప్రకటించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 5 డీఏలను మంజూరు చేస్తే ఒక్కో ఉద్యోగికి నెలకు కనీసం రూ.6 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం పెరిగే అవకాశముందని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. కేంద్రం ప్రకటించిన విధంగా ప్రతి డీఏ కింద బేసిక్‌పేలో 3.64 శాతం వేతనాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. ఇలా 5 డీఏలకు కలిపి 18.2 శాతం జీతం పెరుగుతుంది.

ఆర్థిక భారంతో సర్కారు వెనుకంజ...

రాష్ట్రంలో 3,69,210 మంది శాశ్వత ఉద్యోగులు, 2,88,000 మంది పెన్షనర్లు ఉన్నారు. వీరికి ఈ ఏడాది జనవరితో కలుపుకుంటే మొత్తం నాలుగు డీఏలు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ఒకట్రెండు డీఏలు చెల్లించేందుకు రూ.1,800 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఇప్పటికే ఖాళీగా ఉంది. ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వడమే గగనమైంది. ఇక డీఏలకు నిధులు ఎక్కడి నుంచి తేవాలో తెలియక ప్రభుత్వం సతమతవుతోంది. ఈ క్రమంలోనే డీఏలను ప్రకటించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగు వేస్తోంది.

పీఆర్సీపై ఎన్నో ఆశలు..

2023, జూలై నుంచి అమలు కావాల్సిన కొత్త పీఆర్సీపై ఉద్యోగులు, పెన్షనర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగుల వేతన సవరణ సిఫార్సులకు 2023, అక్టోబర్ 2న అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్ శివశంకర్ నేతృత్వంలో రెండో పీఆర్సీ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఆరు నెలల్లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ గడువు కూడా ముగిసింది. ఈ కమిటీ ఉద్యోగులు, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నుంచి వినతులు స్వీకరించి, ఆ దరఖాస్తులపై వివరణలూ తీసుకుంది.

పీఆర్సీ నివేదిక కూడా ఫైనల్ అయ్యింది. పాత పీఆర్సీ గడువు గతేడాది జూన్ 30తో ముగియగా, 2023, జూలై నుంచి రెండో పీఆర్సీని వర్తింపజేయాలి. అయితే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక పీఆర్సీకి మరో పీఆర్సీకి మధ్య కాలానికి గత వ్యత్యాసాన్ని పూడ్చేందుకు 5 శాతం మధ్యంతర భృతిని ప్రకటించింది. కొత్త పీఆర్సీలో ప్రభుత్వం అంగీకరించిన ఫిట్‌మెంట్ మొత్తాన్ని 2023, జూలై నుంచి చెల్లించాలి. అయితే ఈ బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం మానిటరీ బెనిఫిట్స్ రూపంలో ఇస్తుందా? లేక నోషనల్ బెనిఫిట్స్ రూపంలో ఇస్తుందా? అన్న ఆందోళనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారు.