calender_icon.png 27 October, 2024 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశలన్నీ అతడిపైనే!

21-07-2024 12:05:00 AM

సుదీర్ఘ చరిత్ర ఉన్న ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇప్పటి వరకు వచ్చిన పతకాలు మూడంటే మూడే! అది కూడా దేశానికి స్వతంత్రం రాక ముందు 1900లో బ్రిటీష్ అథ్లెట్ నార్మన ప్రిచార్డ్ రెండు రజతాలు సాధిస్తే.. ఆ తర్వాత 120 ఏండ్లకు టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా జావెలిన్‌త్రోలో పసిడితో మెరిశాడు. మిల్కాసింగ్, పీటీ ఉషా వంటి ఎందరో గొప్ప అథ్లెట్లు ఒలింపిక్ పతకానికి అడుగు దూరంలో నిలవగా.. ఈ సారి నీరజ్ చోప్రా సారథ్యంలో చరిత్ర తిరగరాయడానికి భారత అథ్లెట్ల బృందం సిద్ధమవుతోంది.

ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 29 మంది అథ్లెట్ల బృందం బరిలోకి దిగేందుకు రెడీ అయింది. ఇందులో 11 మంది మహిళలు, 18 మంది పురుషులు ఉన్నారు. ఈ క్రీడల్లో దేశం నుంచి మొత్తం 117 మంది పోటీ పడుతుండగా.. అందులో ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లే అత్యధికం. జూనియర్ స్థాయిలో మెరుపులు మెరిపించి.. పాల్గొన్న తొలి విశ్వక్రీడల్లోనే స్వర్ణం నెగ్గి చరిత్ర లిఖించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై ఈ సారి కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

బరిలోకి దిగితే స్వర్ణమే లక్ష్యంగా చెలరేగే నీరజ్ అథ్లెటిక్స్‌లో వ్యక్తిగత బంగారు పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డుల్లోకెక్కగా.. గత నాలుగేళ్లలో దేశంలో అథ్లెటిక్స్‌కు మంచి ఊపొచ్చింది. అదే కొనసాగిస్తూ.. వరుసగా రెండోసారి కూడా నీరజ్ చాంపియన్‌గా నిలవాలని చూస్తున్నాడు. నీరజ్‌తో పాటు అవినాశ్ సబ్లే (స్టీపుల్ చేజ్), తజిందర్ పాల్ సింగ్ తూర్ (షాట్‌పుట్), జెస్విన్ అడ్రిన్ (లాంగ్ జంప్)పై మంచి అంచనాలు ఉన్నాయి. పురుషుల 4x400 జట్టు కూడా ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన చేస్తూ అంచనాలు పెంచింది.

ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రవేల్, అబూబకర్ నుంచి కూడా పతకం ఆశించొచ్చు. మహిళల విభాగంలో పారుల్ చౌదరి రెండు ఈవెంట్స్‌లో పాల్గొననుంది. అందులో స్టీపుల్‌చేజ్‌లో పారుల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగుతుండగా.. 5000 మీటర్లలో అదృష్టం కలిసివస్తే పోడియంపై నిలవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. పారిస్ ఒలింపిక్స్ బరిలోకి దిగుతున్న అథ్లెటిక్స్ బృందంలో ఇద్దరు తెలుగమ్మాయిలు కూడా ఉన్నారు. 

అథ్లెటిక్స్‌కు 96 కోట్లు

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు మరో ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యం లో కేంద్ర క్రీడా శాఖ ఏ క్రీడకు ఎంత ఖర్చు చేసిందనే వివరాలను భారత ఒలింపిక్ అసోసియేషన్ వె ల్లడించింది. కేంద్రం అత్యధికంగా అథ్లెటిక్స్‌కు రూ. 96.08 కోట్లు  ఖర్చు చేసినట్లు తెలిపింది.