27-04-2025 12:06:24 AM
హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): ప్రభుత్వ పనిలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం కోసం జీవోలన్నీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం పద్మనాభరెడ్డి శనివారం ఒక లేఖ ద్వారా కోరారు.
జీవోలను వెబ్‌సైట్‌లో ఉంచడం ద్వారానే గతంలో పాదర్శకత పెరిగిందని తెలిపారు. 2016లో చట్టానికి విరుద్ధంగా ఉన్న జీవోలను కోర్టుల్లో సవాల్ చేయడంతో అప్పటి సీఎస్, కార్యదర్శులు సమావేశమై ముఖ్యమైన జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టకూడదని నిర్ణయించినట్టు గుర్తుచేశారు.కొందరు వ్యక్తులు ప్రభుత్వ జీవోలపై కోర్టులను ఆశ్రయిస్తూ ప్రజాహిత కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారంటూ ప్రభుత్వం సంజాయిషీ చెప్పుకోవడం విడ్డూరమని అభిప్రాయపడ్డారు.
సమాచారహక్కు చట్టం ద్వారా జీవోల కోసం దరఖాస్తు చేసినా స్పందన అంతంత మాత్రంగానే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫున కోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో 9 ఏళ్లుగా కేసు పెండింగ్‌లోనే ఉందని వివరించారు.
ఎలాంటి ఉపయోగం లేని జీవోలను అప్‌లోడ్ చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ప్రధాన కార్యదర్శిగా ఈ నెల చివరిలో పదవీవిరమణ పొందుతున్న సందర్భంగా ప్రజలకు, స్వచ్ఛంద సేవా సంస్థలకు, మీడియాకు బహుమతిగా అన్ని జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టేలా ఆదేశాలు జారీ చేయాలని సీఎస్ శాంతి కుమారికి విజ్ఞప్తి చేశారు.