* సీఎం అనాలోచిత నిర్ణయాలతో అన్నదాతలకు తిప్పలు
* రైతు సంక్షేమం కోసమే బీఆర్‌ఎస్ అధ్యయన కమిటీ
* త్వరలో నల్లగొండలో రైతుధర్నా చేపడతాం
* బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు, ఇచ్చిన హామీలు అమలు చేయక అన్నదాతలు అరిగోస పడుతున్నారని, అం దుకే రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగాయని వాపోయారు.
రైతు ఆత్మహత్యలపై బీఆర్‌ఎస్ వేసిన కమిటీ వెనుక ఎలాం టి రాజకీయ దురుద్ధేశం లేదని, రైతాంగానికి అండగా నిలవాలనే ఆలోచనే తప్ప మరేమి లేదని కేటీఆర్ పేర్కొన్నారు. మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి నివాసంలో బుధవారం రైతు ఆత్మహత్యలపై వేసిన అధ్యయన కమిటీ తొలి సమవేశం జరిగింది.
అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆదిలా బాద్‌లో ఓ బ్యాంక్‌లో ఆత్మహత్య చేసుకున్న రైతు విషాద ఘటనే ఈ కమిటీ నియమాకానికి కారణమని చెప్పారు. ఈ కమిటీ ఈ నెల 24వ తేదీ నుంచి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి తన అధ్యయనాన్ని ప్రారంభిస్తుందని చెప్పారు.
రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు ఆత్మహత్యలకు కారణాలను అధ్యయనం చేసి నివేదికను రూపొందించి కేసీఆర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుందన్నారు. వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను నమ్మిన రైతులు, ప్రజలు కాంగ్రెస్‌కు అధికారమిస్తే.. ఆ హామీలను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.
బీఆర్‌ఎస్ హయాంలో వ్యవసాయ రంగానికి కేసీఆర్ దన్నుగా నిలిచారన్నారు. రుణమాఫీ, రైతుబంధు గురించి గ్రామసభల్లో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదన్నారు. రాష్ట్రంలో హోంమంత్రి లేకపోవడంతో శాంతిభద్రతలు పడకేశాయని కేటీఆర్ విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రతిపక్షాల మీద అక్రమకేసులు బనాయించడం, సోషల్ మీడియా పోస్టులకు భయపడి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.