11-04-2025 01:00:12 AM
హుస్నాబాద్, ఏప్రిల్ 10 : ‘మన సర్కారు బడిలో ప్రైవేటు స్కూళ్లకంటే ఎక్కువ సౌకర్యాలున్నయ్.. మీ పిల్లలను ఇక్కడే చదివించండి.‘ అంటూ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులను అభ్యర్థించారు. ప్రభుత్వ బడిలో విద్యార్థుల సంఖ్యను పెంచాలనే లక్ష్యంతో గురువారం వారు బడిబాట ప్రోగ్రాం నిర్వ హించారు.
ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల గొప్పతనాన్ని వివరించారు. వారిని సర్కార్ బడి వైపునకు ఆకర్షించే ప్రయత్నం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనంతుల జ్యోతి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల బృందం గ్రామంతోపాటు దాని పరిధిలోని కొత్త కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడారు.
ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల గొప్పతనాన్ని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న కంప్యూటర్ ల్యాబ్, ప్రయాణ భత్యాలు వంటి సౌకర్యాలతో పాటు, ఉన్నత ప్రమాణాల విద్య, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధన గురించి చెప్పారు. క్రీడారంగంలో తమ విద్యార్థులు సాధించిన విజయాలను ప్రధానోపాధ్యాయురాలు ఉద్ఘాటించారు.
క్రీడల ద్వారా లభించే గుర్తింపు, గౌరవం, విద్య, ఉద్యోగ అవకాశాలను వివరించారు. పాఠశాలలో సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు ఉండడం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. అంతేకాకుండా, ఈ ప్రాంతానికి చెందిన పలువురు విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించిన విషయాన్ని ఆమె గర్వంగా గుర్తు చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలలనే ఎంచు కోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏవీఆర్, జంగపల్లి వెంకట నరసయ్య, పాల్గొన్నారు.