- నేడు యూఏఈతో భారత్ ఢీ
- మహిళల ఆసియా కప్
డంబుల్లా: మహిళల ఆసియా కప్‌లో సెమీస్ బెర్త్ లక్ష్యంగా మన అమ్మాయిలు యూఏఈతో పోరుకు సిద్ధమయ్యారు. తొలి పోరులో దాయాది పాక్‌ను చిత్తు చేసిన హర్మన్ సేన మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. నేడు యూఏఈతో జరగనున్న మ్యాచ్‌లో విజయంతో అనధికారికంగా సెమీస్‌లో అడుగుపెట్టాలని డిఫెండింగ్ చాంపియన్ భారత్ భావిస్తోంది. మరోవైపు నేపాల్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన యూఏఈ పటిష్టంగా కనిపిస్తున్న మన జట్టును ఓడించాలంటే సర్వశక్తులు ఒడ్డాల్సిందే. భారత బ్యాటింగ్ విభాగంపై ఎలాంటి ఆందోళన లేదు.
ఓపెనర్లు స్మృతి మంధన, షఫాలీ వర్మ ఇన్నింగ్స్ ఆరంభంలోనే చెలరేగుతూ జట్టుకు శుభారంభాలు ఇస్తున్నారు. ఆ తర్వాత పనిని హేమలత, కెప్టెన్ హర్మన్, రోడ్రిగ్స్‌లు పూర్తి చేస్తున్నారు. పాక్‌తో మ్యాచ్‌లో దీప్తి శర్మ, రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్, శ్రేయాంకలు బౌలింగ్‌లో మంచి ప్రదర్శన కనబరిచారు. వీరికి తోడుగా రాధా యాదవ్ కూడా మెరిస్తే భారత్‌కు తిరుగుండదు. ఇదే గ్రూప్‌లో మరో మ్యాచ్‌లో నేపాల్‌తో పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనుంది. సెమీస్ చేరాలంటే పాక్‌కు నేపాల్‌పై గెలుపు తప్పనిసరి.